gaddar: లాల్- నీల్ ఐక్యత చూస్తుంటే నాకు ఎన్నికల్లో పోటీ చేయాలనిపిస్తోంది: ప్రజా గాయకుడు గద్దర్

  • కమ్యూనిస్టు లందరూ ఐక్యం కావాలి
  • లాల్ నీల్ జెండాలతో నూతన పార్లమెంట్ తీసుకురావాల్సి ఉంది
  •  లాల్ నీల్ ఐక్యతతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యం

తనకు రాజ్యాధికారం దిశగా వెళ్లాలనిపిస్తోందని, ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు నిర్వహించిన బీఎల్ ఎఫ్ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. ‘ఎన్నికల సంస్కరణలు-ఆవశ్యకత’ అంశంపై వక్తలు మాట్లాడారు.

ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, కమ్యూనిస్టు లందరూ ఐక్యం కావాలని, లాల్ (కమ్యూనిస్టులు)  నీల్ (బహుజనులు) జెండాలతో నూతన పార్లమెంట్ తీసుకురావాల్సి ఉందని అన్నారు. లాల్ నీల్ ఐక్యత చూస్తుంటే తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనిపిస్తోందని, ఈ ఐక్యతతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యమని అన్నారు. ఇప్పటి వరకు ఓటరుగా తన పేరు నమోదు చేసుకోలేదని, ఇకపై చేసుకుంటానని గద్దర్ చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ విధానం పేరిట ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని మండిపడ్డారు.

గద్దర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తాం: తమ్మినేని వీరభద్రం

కాగా, గద్దర్ వ్యాఖ్యలపై ఇదే సెమినార్ లో పాల్గొన్న సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం స్పందించారు. ప్రజా గాయకుడు గద్దర్ ను పార్టీలోకి ఆహ్వానిస్తామని, చట్టసభలకు పంపుతామని అన్నారు. ఎర్రజెండాల మధ్య పోరు ఉండకూడదని, ఇందుకు బీఎల్ ఎఫ్ కట్టుబడి ఉందని అన్నారు. టీ మాస్ చర్చించి కొన్ని పథకాలు రూపొందించడం జరిగిందని, ఈ పథకాల్లో గొప్ప పథకం ‘బహుజన బువ్వ పథకం’ అని, బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో ఈ పథకం అమలు జరుపుతామని చెప్పారు. బీఎల్ఎఫ్ తో జతకట్టాలని చాలా పార్టీలు చూస్తున్నాయని, సీపీఐ ఏ ఫ్రంట్ లో ఉన్నా, వారి అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని అన్నారు.

More Telugu News