Iran: బీదర్ లో తమ పౌరులపై దాడిపై స్పందించిన సౌదీ, ఇరాన్... విచారణకు వచ్చిన విదేశీ అధికారులు!

  • పొలం చూద్దామని వెళ్లి పిల్లలకు చాక్లెట్లు పంచిన యువకులు
  • కిడ్నాపర్లని భావించి చావబాదిన స్థానికులు
  • వివరాలు సేకరించిన ఇరాన్ అధికారులు

ఓ పొలం కొందామని కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు ఇరాన్ దేశస్తులు, ఓ సౌదీ వాసి, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తి, తిరుగు ప్రయాణంలో స్థానిక చిన్నారులకు చాక్లెట్లు పంచిన పాపానికి, కిడ్నాపర్లన్న అనుమానంతో దాడిచేసిన ప్రజలు, వారిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనలో దుబాయ్ కి చెందిన మహ్మద్ సాలంతో పాటు ఇరాన్ కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించగా, ఇరాన్, సౌదీ కాన్సులేట్ లు స్పందించాయి. వాట్స్ యాప్ లో వైరల్ అయిన వార్తల కారణంగా తమ దేశస్తులపై దాడి జరగడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఇప్పటికే ఇరాన్ అధికారులు చికిత్స పొందుతున్న తమ దేశస్తుడిని కలిసి ఘటనపై వివరాలు సేకరించారు. కాగా, ఈ కేసులో తొలుత తమ వాట్స్ యాప్ గ్రూప్ లో కిడ్నాపర్లు వచ్చారని, వారిని గ్రామస్థులు బంధించారని పోస్టులు పెట్టిన అడ్మిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News