BJP: కాంగ్రెస్ ముస్లిం పురుషుల పార్టీ!: ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ

  • కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోదీ
  • ముస్లిం మహిళల బాధ ఆ పార్టీకి పట్టదని వ్యాఖ్య
  • తలాక్ వల్ల మహిళలకు ఇక ఇబ్బంది ఉండదని భరోసా

మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ముస్లిం పురుషుల పార్టీ అని ఎద్దేవా చేశారు. వర్షాకాల సమావేశాల్లో తక్షణ ట్రిపుల్ తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లిం పురుషులవైపే ఉంటుందన్న మోదీ.. ట్రిపుల్ తలాక్ విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న ధోరణే అందుకు ఉదాహరణ అన్నారు. ఆజంగఢ్‌లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని తాము ప్రయత్నిస్తున్నామని, కాంగ్రెస్ మాత్రం వారిని తిరిగి చీకట్లోకి నెట్టేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇకపై ట్రిపుల్ తలాక్‌ వల్ల మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడు అన్నట్టు తాను పేపర్లో చదివానని మోదీ పేర్కొన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహజ వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉంటుందని అన్నారని, ఈ సందర్భంగా తాను ఓ ప్రశ్న అడగనున్నానని, కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం పురుషుల కోసమేనా? అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలను కాంగ్రెస్ గౌరవించదా? అని ప్రధాని నిలదీశారు.

More Telugu News