Kadapa District: రూ.35 కోట్లు అప్పు చేసిన కడప పారిశ్రామికవేత్త అజ్ఞాతంలో.. త్వరలోనే ఐపీ.. లబోదిబోమంటున్న బాధితులు!

  • పలువురి నుంచి కోట్లలో వసూలు
  • ముందస్తుగా ఆస్తుల విక్రయం
  • లోలోనే కుమిలిపోతున్న బాధితులు

ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన ఓ పారిశ్రామికవేత్త అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. పలువురి నుంచి ఏకంగా రూ.35 కోట్లకుపైగా వసూలు చేసిన ఆయన కుటుంబ సభ్యులతో సహా కనిపించకుండా పోయారు. ఎర్రముక్కల ప్రాంతానికి చెందిన ఆయనకు  రెండు పల్వరైజింగ్‌ ఫ్యాక్టరీలతో పాటు నాలుగు మైన్స్‌ ఉన్నట్లు సమాచారం.

పారిశ్రామికవేత్త కుటుంబం కనిపించకుండా పోవడంతో ఆయనకు అప్పిచ్చిన పులివెందులకు చెందిన బాధితులు లబోదిబోమంటున్నారు. కడపకు చెందిన ఓ వైద్యుడు ఏకంగా రూ.2 కోట్లు అప్పు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఓ బ్యాంకు ఉద్యోగి కోటి రూపాయలు, పోస్టల్ ఉద్యోగి ఒకరు రూ.70 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. అలాగే మరో వ్యాపారి రూ.1.30 కోట్లు సమర్పించుకున్నట్టు చెబుతున్నారు. కొందరు మధ్యవర్తులుగా ఉండి అప్పులు ఇప్పించినట్టు సమాచారం.

అప్పులు తీసుకున్న పారిశ్రామికవేత్త ముందుస్తు వ్యూహంలో భాగంగానే తన ఆస్తులు విక్రయించినట్టు తెలుస్తోంది. అలాగే, కడపలో తానుంటున్న ఇంటిని కూడా రెండు కోట్లకు విక్రయించాడట. దీంతో ఆయనకు అప్పులు ఇచ్చినవారు లోలోపలే కుమిలిపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే అంత డబ్బు నీకెక్కడిదని ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియక కిక్కురుమనడం లేదు. కడపలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ విషయంపై చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News