Congress: నేటి ఉదయం 11:30 గంటలకే.. కాంగ్రెస్‌లో చేరనున్న కిరణ్ కుమార్ రెడ్డి!

  • ఏపీలో కునారిల్లుతున్న కాంగ్రెస్
  • కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో పార్టీ బలోపేతం
  • రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకోనున్న మాజీ సీఎం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నేటి ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని విభజించాలన్న అధిష్ఠానం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫిబ్రవరి 19, 2014న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది మార్చిలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. అయితే, పార్టీ తరపున అభ్యర్థులను నిలిపినా, ఆయన మాత్రం ఎన్నికల బరిలోకి దిగలేదు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. దీంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ చేరబోతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఏపీలో ఉనికి కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధిష్ఠానం అం‌దులో భాగంగా పార్టీని వీడిన వారిని తిరిగి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే కిరణ్‌ను పార్టీలోకి ఆహ్వానించింది.
Congress
Kiran kumar Reddy
Rahul Gandhi
Andhra Pradesh

More Telugu News