Hyderabad: హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌లో జంతువుల మృతిపై మంత్రి జోగు రామ‌న్న స‌మీక్ష‌

  •  అనారోగ్యంతో మూడు జంతువుల మృతి
  • మొదట అరుణ అనే సింహం మృతి
  • కొన్ని రోజులకే ప్రాణాలు కోల్పోయిన జ‌మున అనే ఏనుగు
  • అనంతరం దీప అనే చిరుత మృతి

హైద‌రాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్కులో ఇటీవ‌ల మూడు జంతువులు మృతి చెందాయి. ఈ ఘ‌ట‌న‌లపై తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖల మంత్రి జోగు రామ‌న్న ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ స‌చివాల‌యంలో స‌మ‌గ్ర స‌మీక్ష నిర్వ‌హించారు. జంతువుల మృతిపై వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మునీంద్ర‌, జూ పార్క్ డైరెక్ట‌ర్ సిద్ధాంత్ కుక్రేటీల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

జంతువుల సంర‌క్ష‌ణ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, భ‌విష్య‌త్తులో ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా గ‌ట్టి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి జోగు రామ‌న్న అధికారుల‌ను ఆదేశించారు. వ‌య‌స్సు మీద ప‌డ‌టం, తీవ్ర‌మైన ఆరోగ్య సమస్యలు రావ‌డం వ‌ల్ల అరుణ అనే సింహం, జ‌మున అనే ఏనుగు, దీప అనే చిరుత మృతి చెందాయ‌ని ప‌శు వైద్య నిపుణులు ఇచ్చిన నివేదిక‌ల‌ను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.

జూ పార్క్‌లో ఉన్న మిగ‌తా జంతువుల ఆరోగ్య ప‌రిస్థితులను మంత్రి జోగు రామ‌న్న అడిగి తెలుసుకున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు జంతువుల ఆరోగ్య ప‌రిస్థితుల‌ను తెలుసుకుని, మెరుగైన వైద్యాన్ని అందించాల‌ని ఆయ‌న ఆదేశించారు. దేశంలోని ఇత‌ర జూ పార్క్‌ల‌లో ఉన్న జంతువుల స‌గ‌టు జీవిత కాలం క‌న్నా హైద‌రాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌లోని జంతువుల జీవ‌న కాలం రెండేళ్లు ఎక్కువ‌గా ఉంద‌ని అధికారులు తెలిపారు. జంతువుల విష‌యంలో అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి జోగు రామ‌న్న ఆదేశించారు. 

More Telugu News