Swapnareddy: ఈ స్వప్నారెడ్డి ఎవరు చెప్మా?... కేసీఆర్ నోటి నుంచి పేరు రాగానే ఆరాతీసిన ఇంటెలిజెన్స్!

  • పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు
  • స్వప్నారెడ్డి కారణంగానే సమస్య వచ్చిందన్న కేసీఆర్
  • ఆమె పిటిషన్ పై విచారణ తరువాతే హైకోర్టు ఉత్తర్వులు

గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించకుండా చూసుకోవాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంపై స్పందించిన కేసీఆర్, సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు చెప్పిన వేళ, ఆయన నోటి నుంచి వినపడిన పేరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైకోర్టు తీర్పుకు స్వప్నారెడ్డి కారణమని కేసీఆర్ చెప్పగా, ఆమె ఎవరా అని పలువురు చర్చించుకోవడం మొదలుపెట్టారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆమె గురించిన వివరాలు తెప్పించుకున్నారు.

ఈ స్వప్నారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆందోల్ మండలం పోసాని పేట గ్రామ సర్పంచ్. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని గుర్తుచేస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం తాజా ఉత్తర్వులను వెలువరించింది. ఇక ఇదే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. కాగా, తానేమీ ఎన్నికలను ఆపాలన్న ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించలేదని చెప్పిన స్వప్నారెడ్డి, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించరాదనే హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే, తాను కూడా వెళతానని చెప్పడం గమనార్హం.

More Telugu News