Andhra Pradesh: ఏపీలో తెలుగు భాషా బోధ‌న‌లో నిర్ల‌క్ష్యం చేస్తే జ‌రిమానా.. ఆరు నెల‌ల జైలు శిక్ష.. జీవో విడుదల

  • మాతృభాష‌కు పట్టం
  • ఏపీ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు
  • నిధుల కొర‌త లేకుండా రూ.25 కోట్లు 
  • ప్ర‌భుత్వ ప‌ర‌మైన ప్ర‌చుర‌ణ‌లు అన్నీ విధిగా తెలుగులోనే

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుద‌నం మ‌రింత‌గా ప‌రిమ‌ళించ‌నుంది. క‌మ్మ‌నైన అమ్మ భాష ప్రాధాన్యం పెంచే దిశ‌గా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. తెలుగు వెలుగుల ప్రాభ‌వం చాటి చెబుతూ ప్ర‌జ‌ల భాష‌ను పాల‌నలోనూ చూపేలా ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు జీవం పోసింది. స్వ‌యంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో న‌డిచే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, వార‌స‌త్వ బోర్డు ద్వారా తెలుగు భాషాభివృద్ధి సంస్థ జీవం పోసుకోగా, రాష్ట్ర ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా ఇందుకు సంబంధించిన జీవోను సిద్ధం చేశారు.

ప్ర‌భుత్వం నియ‌మించే ఛైర్మ‌న్‌తో పాటు సాధార‌ణ ప‌రిపాల‌న, లా, కార్మిక‌, ప‌ర్యాట‌క సాంస్కృతిక, విద్యా శాఖ కార్య‌ద‌ర్శులు స‌భ్యులుగా ఉండే ఈ సంస్థలో తెలుగు సాహిత్యం, ప‌రిపాల‌న‌, చ‌ట్టం వంటి అంశాల‌లో నిపుణ‌త క‌లిగిన న‌లుగురు స‌భ్యులుగా ఉంటారు. సంస్థ సీఈవో పాల‌నా వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించ‌నుండ‌గా, ప్రాధికార సంస్థ ద్వారా ప్ర‌త్యేకంగా ఐదు క‌మిటీల‌ను సైతం ఏర్పాటు చేసి భాషకు పున‌రుత్తేజం క‌లిగించేందుకు కృషి చేయ‌నున్నారు.

అధికార భాష‌గా తెలుగు అమ‌లు, విద్యా విధానంలో అంత‌ర్భాగంగా తెలుగు భాషాభివృద్ధి, ఈ-తెలుగు అభివృద్ధి, ప్ర‌చుర‌ణ‌లు, అనువాదం, అంత‌ర్జాతీయంగా తెలుగు అభివృద్ధి వంటి అంశాల‌లో ఈ క‌మిటీలు త‌మ సేవ‌ల‌ను అందించేలా చ‌ట్టం రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. ప్ర‌ధానంగా అధికార భాష అమ‌లులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగ‌మించేందుకు ప్రాధికార సంస్థ ప్ర‌య‌త్నిస్తుంది.

ప్ర‌భుత్వ‌ప‌రంగా ప్ర‌జ‌లు వినియోగించే ప్ర‌తి ద‌ర‌ఖాస్తు, ప్ర‌భుత్వ రికార్డుల‌ను తెలుగులో అందుబాటులో ఉంచ‌టంపై దృష్టి సారిస్తారు. ప్ర‌త్యేకించి అయా న్యాయ‌స్ధానాలు వెలువ‌రించే తీర్పులు సైతం తెలుగులో ఉండేలా సమ‌న్వ‌యం చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా ఉంది. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన అధికారులు భాష‌పై మ‌రింత ప‌ట్టు సాధించేలా శిక్ష‌ణ‌, కార్యశాల‌, స‌ద‌స్సులు, ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను నిర్వ‌హించ‌టం కూడా అధారిటీ చేప‌డుతుంది.

అధికారుల‌కు తెలుగుపై ఉన్న ప‌ట్టు ఎంత అన్న‌దానిపై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్ష‌లు సైతం నిర్వ‌హిస్తారు. కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రంగానే కాకుండా, ఇక్క‌డి కేంద్ర సంస్థల‌్లో కూడా తెలుగు అమలు చేసే క్ర‌మంలో ప్ర‌త్యేక చ‌ర్య‌లు ఉంటాయి. మ‌న భాషా విధానాన్ని తెలియ ప‌రుస్తూ విమానాశ్ర‌యాలు, బ్యాంకులు, త‌పాలా కార్యాల‌యాలు ఇలా అన్నింటా తెలుగు క‌నిపించేలా చూస్తారు. అధికార భాష‌గా తెలుగు అమ‌లు అవుతుందా? లేదా? అన్న అంశంపై తాలుకా, జిల్లా స్థాయిలో స‌మీక్ష‌లు చేస్తూ గ్రామ స‌చివాల‌యం నుండే తెలుగు అమ‌లు కోసం చ‌ర్య‌లు ఉంటాయి.

శాస‌న స‌భ వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన అన్ని అంశాలు తెలుగులోనే ఉండేలా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ అమ‌లు కానుంది. అంత‌ర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న అన్ని ప‌దాల‌కు తెలుగులో ప‌ద‌కోశాన్ని సిద్ధం చేస్తారు. ప్ర‌భుత్వ ప‌రమైన శంకు స్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల శిలా ఫ‌ల‌కాలతో పాటు, అన్ని ర‌కాల నామ ఫ‌ల‌కాలు, గోడ‌ ప‌త్రిక‌లు, ఇలా ప్ర‌తి విష‌యంలోనూ తెలుగుద‌నం క‌నిపించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌టం ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ విధుల‌లో ఒక‌టిగా ఉంది. ప్ర‌భుత్వ ప‌ర‌మైన ప్ర‌చుర‌ణ‌లు అన్నీ విధిగా తెలుగులోనే ఉండాలి.  

హెచ్చరిక..

ఈ నేప‌థ్యంలో ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ముఖ్య‌మంత్రి గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ జీవం పోసుకుంద‌న్నారు. ప‌రిపాల‌న‌లో తెలుగు అమ‌లు, వినియోగంపై కాల‌ప‌రిమితితో కూడిన నిబంధ‌నావ‌ళి ఉంటుంద‌ని, అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

తెలుగు భాష అమ‌లుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, నిధుల కొర‌త సైతం లేకుండా ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక శ్ర‌ధ్ధ‌తో తెలుగు భాషాభివృద్ది నిధి పేరిట రూ.25 కోట్లు మంజూరు చేసార‌ని మీనా పేర్కొన్నారు. రాష్ట్రంలో దుకాణదారులు తెలుగులో నామ‌ఫ‌ల‌కాల‌ను ఏర్పాటు చేయ‌క‌పోతే రూ.50వేల వ‌ర‌కు జ‌రిమానా ఉంటుంద‌ని, శిలాఫ‌ల‌కాలు, గోడ‌ప‌త్రిక‌ల‌లో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా తెలుగు వినియోగించాల‌ని, లేకుంటే రూ.10వేలు జ‌రిమానా త‌ప్ప‌ద‌న్నారు.

నిబంధ‌న‌ల మేర‌కు తెలుగుతో ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు జ‌ర‌ప‌ని ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు రూ.5,000 అప‌రాధ‌ రుసుం త‌ప్ప‌ద‌న్నారు. ఎప్ప‌టి క‌ప్పుడు ప్ర‌భుత్వం జారీ చేసే నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా విద్యా సంస్థల నిర్వాహ‌కులు తెలుగును బోధ‌నాంశంగా అమ‌లు చేయ‌క‌పోతే రూ.50 వేల జ‌రిమానా, ఆరు నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని ముఖేష్ కుమార్ మీనా స్ప‌ష్టం చేసారు. తియ్య‌నైన తెలుగును కాపాడుకునేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా చేస్తున్న కృషికి అధికారులు స‌హ‌క‌రించాల‌న్నారు. 

More Telugu News