Narendra Modi: ‘మోదీ’ అనే రెండక్షరాలను జగన్-పవన్ ఉచ్చరించలేకపోతున్నారు: మంత్రి గంటా మండిపాటు

  • ‘కేంద్రంపై పవన్ ఎందుకు పోరాడటం లేదు?
  • ‘విశాఖకు రైల్వేజోన్ విషయమై ఎందుకు ప్రశ్నించడం లేదు?
  • ‘కళ్లుండీ చూడలేని ఓ కబోదిలా’ పవన్ వ్యవహరిస్తున్నారు

తెలుగుదేశం పార్టీపైన, ఆ పార్టీ నేతలపైన తన ఉత్తరాంధ్ర పర్యటనలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, ఆరోపణలు చేయడంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ ని సూటిగా ప్రశ్నిస్తూ ఆయనకు గంటా ఓ లేఖ రాశారు.

‘కేంద్రంపై పవన్ ఎందుకు పోరాడటం లేదు?’ ‘విశాఖకు రైల్వేజోన్ విషయమై ఎందుకు ప్రశ్నించడం లేదు? అంటూ మొత్తం 25 ప్రశ్నలను పవన్ కు తన లేఖలో గంటా సంధించారు. ఈ సందర్భంగా విశాఖలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రం నుంచి సహకారం లేకపోయినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్న సీఎం చంద్రబాబుకు అభినందనలు చెప్పాల్సిందిపోయి ఆయన్ని విమర్శిస్తారా? అంటూ పవన్ పై మండిపడ్డారు.

‘కళ్లుండీ చూడలేని ఓ కబోదిలా’ పవన్ వ్యవహరిస్తున్నారని, అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘మీరు (పవన్ కల్యాణ్) మాట్లాడుతున్న మాటలు మీ సొంతవా? లేక బీజేపీ స్క్రిప్టా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలా? లేకపోతే మీ ముగ్గురు కలిసి మాట్లాడుతున్న మాటలా? ఈ విషయాన్ని మీరు ప్రజలకు స్పష్టం చేయాలి.

‘ప్రధాని మోదీపై అందరం కలిసి ఒత్తిడి చేద్దాం’ అని  మీరు (పవన్ కల్యాణ్, జగన్) అన్నారు. కానీ, మోదీ గారిని ఒక్కమాట కూడా అనలేకపోతున్నారు! ‘మోదీ’ అనే రెండక్షరాలను జగన్, పవన్ లు ఉచ్చరించలేకపోతున్నారు. పోరాడుతున్న టీడీపీిని విమర్శిస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. నిజాలు తెలుసుకుని మాట్లాడండి’ అని గంటా హితవు పలికారు.

More Telugu News