Bongu Biryani: 'బొంగులో బిర్యానీ'... ఇక ఆంధ్రప్రదేశ్ బ్రాండ్!

  • కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ పర్యాటక శాఖ
  • బిర్యానీ పేరుచెబితే ఏపీ గుర్తుకు రావాలంటున్న అధికారులు
  • త్వరలోనే ఆంధ్రా తాలి ఎలా ఉండాలన్న దానిపై నిర్ణయం

బిర్యానీ పేరు చెబితే హైదరాబాద్ గుర్తుకు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే స్థాయిలో ఏపీ బిర్యానీగా బొంగు బిర్యానీ (బ్యాంబూ... అంటే వెదురు బొంగు చెక్కలో తయారు చేసే బిర్యానీ)ని ప్రమోట్ చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బ్రాండ్ గా బొంగు బిర్యానీని ప్రకటించింది. ఏపీ ఆహారంగా ఈ రకం బిర్యానీని ప్రచారంలోకి తేవాలని నిర్ణయించిన ఏపీ పర్యాటక శాఖ, అందుకోసం ఓ వార్షిక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా ప్రముఖ హోటళ్లలోని చెఫ్ లకు బొంగు బిర్యానీ, బొంగు చికెన్ తయారీపై శిక్షణ ఇవ్వడం, ఇప్పటివరకూ విశాఖ, అరకు పర్యాటకులకే తెలిసిన రుచిని రాష్ట్రానికి వచ్చే అతిథులకు రుచి చూపించాలని, విద్యార్థులకు, మహిళలకు బొంగులో వంటకాలపై పోటీలు పెట్టాలని నిర్ణయించింది. ఇదే సమయంలో అన్ని ముఖ్య హోటళ్లలో కనీసం రెండు హోటళ్లు వారం రోజుల పాటు ఆంధ్రా సంప్రదాయ వంటకాలనే వడ్డించేలా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించాలని కూడా పర్యాటక శాఖ నిర్ణయించింది.

వివిధ ప్రాంతాల్లో భోజన పోటీలు నిర్వహించి, ఎక్కువగా వడ్డించే పదార్థాలతో ఆంధ్రా తాలిని ఖరారు చేసి, ఎక్కడ పర్యటిస్తున్నా అదే తాలిని వారికి అందించేలా చూడాలని అధికారులు నిర్ణయించారు. ఇక పూతరేకులు, కాజాలు, ఉలవచారు వంటి వాటికి జియోగ్రాఫికల్‌ ఐడెంటిఫికేషన్‌ ను సాధ్యమైనంత త్వరగా సాధించాలని కూడా అధికారులు భావిస్తున్నారు.

More Telugu News