Thailand: ఫైనల్ టాస్క్... ఆక్సిజన్ మాస్క్ లు, స్కూబా కిట్ లతో గుహలోకి వెళ్లిన డైవర్లు!

  • గుహలోని మిగిలిన వారిని బయటకు తేనున్న డైవర్లు
  • ఇప్పటికే 8 మందిని క్షేమంగా తెప్పించిన అధికారులు
  • మరో ఐదుగురి కోసం ప్రారంభమైన ఆపరేషన్

థాయ్ లాండ్ లోని గుహలో చిక్కుకుపోయివున్న చివరి నలుగురు ఆటగాళ్లు, వారి కోచ్ లను బయటకు తెచ్చేందుకు నిపుణులైన డైవర్ల బృందం గుహలోకి వెళ్లింది. ఇప్పటికే రెండు దఫాలుగా ఎనిమిది మందిని వెలుపలికి తెచ్చిన బృందం, నేడు మిగతావారికి ఎలాంటి ఆపదా కలుగకుండా బయటకు తేవాలన్న ఉద్దేశంతో సరిపడా ఆక్సిజన్ మాస్క్ లు, స్కూబా కిట్ లను ధరించి గుహ లోనికి వెళ్లింది. గడచిన రెండు రోజులుగా గుహ లోపలికి, బయటకు వెళ్లి వస్తున్న వారినే అధికారులు నేడు లోపలికి పంపారు. ఓ వైపు వర్షం పడుతుండగా, గుహలో నీటిమట్టం పెరగకుండా జాగ్రత్త పడుతున్న అధికారులు, నేడు ఆపరేషన్ ను ముగించాలని భావిస్తున్నారు.

కాగా, గుహ నుంచి 8 మందిని బయటకు తెచ్చామని చెబుతున్న అధికారులు, వారి పేర్లను మాత్రం వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. వారి పేర్లను బయటపెడితే, ఇంకా వెలుపలికి రాని బాలుర తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందన్న కారణంతోనే వారి వివరాలు వెల్లడించడం లేదని, నేడు బయటకు వచ్చిన బాలల తల్లిదండ్రులను ఆసుపత్రిలో తమ బిడ్డలను చూసేందుకు అనుమతిస్తామని తెలిపారు.

More Telugu News