beggar: గుడికి రూ.లక్ష విరాళమిచ్చిన యాచకుడు!

  • విజయవాడలోని ముత్యాలంపాడులో ఘటన
  • 11 ఏళ్ల వయసులో తెలంగాణ నుంచి విజయవాడకు వచ్చిన యాదిరెడ్డి
  • మొదట రిక్షా తొక్కి బతికిన వ్యక్తి
  • ఇప్పటివరకు ఆలయాలకు మొత్తం రూ.5,00,000 విరాళం

ఓ గుడికి యాచకుడు రూ.లక్ష విరాళంగా ఇచ్చిన ఘటన విజయవాడలోని ముత్యాలంపాడులో చోటు చేసుకుంది. 11 ఏళ్ల వయసులో తెలంగాణ నుంచి విజయవాడకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డ యడ్ల యాదిరెడ్డి మొదట రిక్షా తొక్కి డబ్బులు సంపాదించేవాడు. వయసు మీదపడడంతో పని చేయలేక, అక్కడి షిర్డీ సాయిబాబా మందిరంలో యాచకుడిగా మారాడు. తనకు 'నా' అనే వారు ఎవరూ లేరని.. తాను భిక్షమెత్తుకున్న సాయిబాబా గుడికి మంచి చేయాలని విరాళమిచ్చానని చెప్పాడు.

గతంలోనూ ఆయన పలు ఆలయాలకు భారీగా విరాళాలు అందించాడు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఈనెల 26న లక్ష నారికేళ జలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికే యడ్ల యాది రెడ్డి రూ.1,08,000 విరాళంగా అందజేశాడు. ఇప్పటివరకు ఆలయాలకు మొత్తం 5,00,000 రూపాయలు ఇచ్చాడు. తన జీవిత చరమాంకం దేవుడి సన్నిధిలోనే గడిపేస్తానని చెప్పాడు. తనకు అన్నం పెట్టిన భక్తులకు కృతజ్ఞతలు చెబుతున్నానని యాదిరెడ్డి చెప్పాడు. దేవుడి వల్లే తాను ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నానని అన్నాడు. ఆ మందిర గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదిరెడ్డి గతంలోనూ పలుసార్లు విరాళాలు ఇచ్చారని, శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వెండి ఆభరణాలు కూడా చేయించారని కొనియాడారు. 

More Telugu News