Hyderabad: హైదరాబాదులో నెల రోజుల పసిగుడ్డు రూ.50 వేలకు విక్రయం.. దొరికిపోయిన వైనం!

  • ముగ్గురి చేతులు మారిన పసిబిడ్డ
  • తల్లిదండ్రులు ఉచితంగా ఇచ్చేస్తే తీసుకున్న వారు అమ్మకం
  • ఫోన్‌లో డీల్ కుదుర్చుకుంటుండగా విన్న హాకర్ 

నెల రోజుల పసికందును రూ.50 వేలకు విక్రయించిన నలుగురు వ్యక్తులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన సుజాత-భజన్ దంపతులకు పాప పుట్టింది. ఇప్పటికే వారికి ఇద్దరు అమ్మాయిలు ఉండడంతో చిన్నారిని వదిలించుకోవాలని చూశారు.

‌హయత్‌‌నగర్‌కే చెందిన బాలాజీ (50), అతడి మరదలు లక్ష్మి(35) ని సంప్రదించారు. ఎవరికైనా పిల్లలు కావాలనుకుంటే తమ పాపను ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో ఆ చిన్నారిని తీసుకున్న బాలాజీ బోరబండకు చెందిన భరత్ కుమార్ (30)-లక్ష్మి (26) దంపతులకు ఆ చిన్నారిని రూ.50 వేలకు విక్రయించాడు.

ఓ సంతాన సాఫల్య కేంద్రంలో పనిచేస్తున్న భరత్-లక్ష్మి కలిసి మియాపూర్‌కు చెందిన మరో వ్యక్తికి ఆ శిశువును రూ.70 వేలకు విక్రయించేందుకు ఫోన్‌లో అమీర్ పేట జంక్షన్ వద్ద డీల్ కుదుర్చుకుంటుండగా ఓ హాకర్ ఆ మాటలు విన్నాడు. దీంతో వారిని అనుసరిస్తూ మియాపూర్ వరకు వెళ్లాడు. గమనించిన భరత్ దంపతులు అతడికి కొంత మొత్తం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అందుకు నిరాకరించిన ఆయన వారిద్దరినీ పంజాగుట్ట తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News