Andhra Pradesh: అనుకూలించిన వాతావరణం... యాత్రికుల కోసం హిమాలయాల్లో ల్యాండ్ అయిన 17 విమానాలు!

  • ఐదు రోజులుగా సిమికోట్, హిల్సాలో చిక్కుకున్న యాత్రికులు
  • ఈ ఉదయం ప్రారంభమైన యాత్రికుల తరలింపు
  • సహాయపడుతున్న ఏపీ, తెలంగాణ అధికారులు

కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి చిక్కుకున్న యాత్రికుల తరలింపు ఈ ఉదయం ప్రారంభమైంది. వర్షం తగ్గి, వాతావరణం అనుకూలించగానే, హిమాలయాల్లో చిక్కుకుపోయిన వారిని వెనక్కు తెచ్చేందుకు 17 విమానాలు వెళ్లాయి. మరో 10 హెలికాప్టర్లను కూడా సహాయక చర్యల నిమిత్తం అధికారులు రంగంలోకి దించారు. ఈ ఉదయం 6 గంటల నుంచి యాత్రికుల తరలింపు ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నానికి అందరినీ వెనక్కు తెస్తామని అధికారులు వెల్లడించారు.

సిమికోట్ లో 643 మంది, హిల్సాలో 350 మంది యాత్రికులు చిక్కుకుని ఉండగా, వాతావరణం అనుకూలించినప్పటికీ, వీరిని ముందుకు వెళ్లనివ్వకుండా వెనక్కు పంపనున్నట్టు తెలిపారు. తొలుత యాత్రికులను నేపాల్ గంజ్ విమానాశ్రయానికి తీసుకు వస్తామని, అక్కడి నుంచి బస్సుల్లో ఖాట్మండు, న్యూఢిల్లీ, లక్నోలకు తరలిస్తామని చెప్పారు. ఇప్పటికే నేపాల్ చేరుకున్న కొందరు ఏపీ, తెలంగాణ అధికారులు తెలుగు యాత్రికులకు సాయం చేస్తున్నారు. తెలుగు యాత్రికులను ఢిల్లీలోని ఏపీ భవన్ కు తరలించి, అక్కడి నుంచి స్వస్థలాలకు పంపుతామని వారు తెలిపారు.

More Telugu News