Ratan Tata: ప్రపంచంలోనే అతి తక్కువ ధరలో లభించే కారు 'నానో' ఇక కనపడదు... జూన్ లో తయారైంది ఒక్కటే కారు!

  • రతన్ టాటా కన్న కలల కారుగా మార్కెట్ లోకి నానో
  • గత నెలలో అమ్మింది మూడు యూనిట్లు మాత్రమే
  • ఒక్క కారు ఎగుమతి ఆర్డర్ కూడా లేదన్న సంస్థ
  • స్టాక్ మార్కెట్లకు వెల్లడించిన టాటా మోటార్స్

టాటా గ్రూప్ చైర్మన్ గా రతన్ టాటా కన్న కలల కారుగా మార్కెట్ లోకి వచ్చిన నానో కథ ముగిసింది. 'చిన్నకారు' సరదాను మధ్య తరగతి ప్రజలకు కూడా దగ్గర చేయాలన్న లక్ష్యంగా తయారైన లక్ష రూపాయల కారు నానో విక్రయాలు దారుణంగా పడిపోవడం, జూన్ లో దేశవ్యాప్తంగా మూడంటే మూడు కార్లు మాత్రమే అమ్ముడు కావడంతో ఇక నానో కార్ల తయారీ యూనిట్ ను తొలగించాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. జూన్ లో ఒక్క కారును మాత్రమే తయారు చేశామని సంస్థ వెల్లడించింది.

నానో కార్ల తయారీని ఆపే విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, జూన్ లో తాము ఎటువంటి ఎగుమతి ఆర్డర్ లనూ పొందలేదని స్టాక్ మార్కెట్లకు వెల్లడించింది. జూన్ 2017లో 275 యూనిట్లను తయారు చేశామని, ఈ సంవత్సరం అది ఒక్క యూనిట్ కు పడిపోయిందని, గత సంవత్సరం జూన్ లో 167 యూనిట్లను విక్రయించగా, ఇప్పుడది 3కు తగ్గిందని పేర్కొంది. నానో కార్లను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొనసాగించే వీల్లేదని వ్యాఖ్యానించిన సంస్థ ప్రతినిధి ఒకరు, 2019 తరువాత మరిన్ని పెట్టుబడులు పెడితేనే నానో తయారీ యూనిట్ ను నిర్వహించగలమని, ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కస్టమర్ల నుంచి వచ్చే డిమాండ్ ను బట్టి కార్లను తయారు చేస్తామని అన్నారు.

కాగా, జనవరి 2008లో ఆటో ఎక్స్ పోలో తొలిసారిగా దర్శనమిచ్చిన నానో, అప్పట్లో ప్రపంచ వాహన మార్కెట్లో పెను సంచలనంగా నిలిచింది. మార్చి 2009లో తొలి కారు మార్కెట్లోకి వచ్చిన వేళ, రూ. 1 లక్షకే కారును అందించినప్పటికీ, రానురానూ ఉత్పత్తి వ్యయం పెరుగుతూ ఉండటంతో నానో ధర రూ. 2 లక్షలను దాటింది. నానో వల్ల తాము రూ. 1000 కోట్లను నష్టపోయామని, అయితే, భావోద్వేగాలతో ముడిపడివున్న విషయం కాబట్టే ఈ కారును కొనసాగిస్తున్నామని టాటా సన్స్ కు చైర్మన్ గా ఉన్న సమయంలో సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు.

More Telugu News