Warangal Rural District: ఓ భర్త అమానుషం.. భార్య బతికుండగానే దశదిన కర్మ.. కార్డులు ముద్రించి బంధువులకు పంపిణి

  • స్వయంగా భార్య చేతికి కార్డు
  • నిర్ఘాంతపోయిన కుటుంబ సభ్యులు
  • పోలీసులకు ఫిర్యాదు.. కౌన్సెలింగ్
బతికుండగానే భార్యకు దశదిన కర్మ నిర్వహించాలనుకున్నాడో ప్రబుద్ధుడు. కార్డులు కొట్టించి బంధువులకు, స్నేహితులకు, చుట్టుపక్కల వారికి పంచిపెట్టాడు. స్వయంగా భార్యకు కూడా ఓ కార్డు ఇవ్వడంతో ఆమె షాక్‌కు గురైంది. వరంగల్ జిల్లా సంగెం మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం..

మండలంలోని కొత్తపల్లికి చెందిన సుమతికి ఐదేళ్ల క్రితం వరంగల్ మండలంలోని అల్లిపురానికి చెందిన పిన్నింటి చందర్‌రావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పూర్తిగా తాగుడుకు బానిసైన చందర్‌రావు భార్యను నిత్యం వేధించేవాడు. ఇటీవల వేసవి సెలవులు రావడంతో సుమతి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది.

గత నెల 25న కొత్తపల్లి వచ్చిన చందర్‌రావు ఆమె చేతిలో ఓ కార్డు పెట్టి వెళ్లిపోయాడు. అది చూసిన సుమతి, ఆమె తల్లి సరోజన షాక్‌కు గురయ్యారు. జూన్ 12న తన భార్య సుమతి మృతి చెందిందని, 26న దశదిన కర్మ నిర్వహిస్తున్నామని, అందరూ రావాలని అందులో రాసి ఉండడంతో వారు నిర్ఘాంతపోయారు. తేరుకున్న అనంతరం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యను తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు చందర్‌రావు అంగీకరించగా, సుమతి మాత్రం అతడితో వెళ్లేందుకు నిరాకరించింది.
Warangal Rural District
Nallabelli
marriage

More Telugu News