indian army chief: సినిమాలపై విద్యార్థి ప్రశ్నకు ఆర్మీ చీఫ్ ఆసక్తికర సమాధానం!

  • ఛత్తీస్ గఢ్ కు చెందిన విద్యార్థులతో బిపిన్ రావత్ మమేకం
  • ‘దేశభక్తి సినిమాల గురించి మీ అభిప్రాయం?’ ఏంటన్న ఓ విద్యార్థి
  • తాను సినిమాలు చూసి ముప్పై ఏళ్లు అయిందన్న రావత్

ఛత్తీస్ గఢ్ కు చెందిన విద్యార్థులతో మమేకమైన సందర్భంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ను ఓ చిన్నారి ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. ‘హిందీలో వస్తున్న దేశభక్తి సినిమాల గురించి మీ అభిప్రాయం?’ ఏమిటని రావత్ ను 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ప్రశ్నించాడు. ఇందుకు రావత్ చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘ఒకే చోట మూడు గంటలు కూర్చునే సమయం, వీలూ నాకు లేవు. నేను సినిమాలు చూసి ముప్పై ఏళ్లు అయింది. అందుకని మన సినిమాల గురించి నాకు తెలియదు’ అని చెప్పడంతో అక్కడి విద్యార్థులు ఆశ్చర్యపోయారు.

ఈ సందర్భంగా ఆర్మీ గురించిన విశేషాలు, జమ్మూకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితుల గురించి విద్యార్థులకు ఆయన వివరించారు. అంతేకాకుండా, చదువు, గెలుపోటములు, జీవితం తదితర అంశాల గురించీ ఆయన ప్రస్తావించారు. జీవితంలో అయినా, చదువులో అయినా ఓటమి సహజమని, అయితే, ఎన్ని ఓటములు ఎదురైనా వెనుకడుగు వేయకూడదని, ఎప్పుడూ నమ్మకం కోల్పోకూడదని విద్యార్థులకు చెప్పారు.

‘మీరు దేశ భవిష్యత్ కు ఆశా కిరణాలు.. కష్టపడండి.. విజయానికి కఠోర శ్రమే కీలకం’ అని వారికి రావత్ సూచించారు. కాగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇరవై మంది విద్యార్థులు వారం రోజుల పాటు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు ఢిల్లీలో ఆయనను కలిశారు. 

More Telugu News