Deepa: 23 ఏళ్ల చిరుత ‘దీప’ పరిస్థితి విషమం.. ఆందోళనలో జూ అధికారులు!

  • జూలో ఒక్కొక్కటిగా ప్రాణాలు విడుస్తున్న జంతువులు
  • మొన్న ఏనుగు.. నిన్న సింహం
  • నేడు చిరుత పరిస్థితి విషమం

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని 22 ఏళ్ల ఆడ చిరుతపులి దీప పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో దానిని రక్షించేందుకు జూ అధికారులు కష్టపడుతున్నారు. గత రెండు నెలలుగా దీప బ్రాంకైటిస్ (శ్వాస నాళాల్లో వాపు)తో బాధపడుతోంది. దీంతోపాటు వృద్ధాప్యం కారణంగా వచ్చే సమస్యలు కూడా చిరుతను చుట్టుముట్టడంతోనే సమస్య మరింత తీవ్రమైందని జూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం‌ దీపను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెటర్నరీ వైద్య నిపుణులు చిరతను పర్యవేక్షిస్తున్నారు. దీప ఆహారం తీసుకోవడం లేదని, దీంతో నీరసంగా ఉందని తెలిపారు. జూలోని మరో మూడు జంతువులు కూడా ప్రాణాలతో పోరాడుతున్నట్టు చెప్పారు.  

చిరుత పులుల జీవిత కాలం 18 ఏళ్లే కాగా, దీప వయసు 22 దాటింది. వృద్ధాప్యం కారణంగానే అనారోగ్యానికి గురైంది. వైద్య చికిత్సకు చిరుత స్పందించకపోవడంతో దానితో అనుబంధాన్ని పెనవేసుకున్న సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. ఇటీవలే 44 ఏళ్ల జమున అనే ఏనుగు ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించింది. 15 ఏళ్ల ఆసియాటిక్ సింహం క్రేజీ జూన్ 28 చనిపోయింది. ఇప్పుడు దీప పరిస్థితి విషమంగా ఉండడం అధికారులనే కాదు.. నగర వాసులను, జంతు ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది.

More Telugu News