Telangana: రేషన్‌ డీలర్లతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ

  • చర్చలు జరిపిన మంత్రి ఈటల
  • కనీస వేతనంపై కమిటీ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
  • బకాయిలు, ఆరోగ్య కార్డుల సమస్యల పరిష్కారానికి హామీ
  • నెల రోజుల్లోగా పరిష్కరించకపోతే మళ్లీ సమ్మె

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో చౌక ధరల దుకాణాల డీలర్లు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు హైదరాబాద్‌లో వారితో మంత్రి ఈటల రాజేందర్‌ చర్చలు జరిపారు. ఇందులో మంత్రి లక్ష్మారెడ్డి, ఉప సభాపతి పద్మా దేవేందర్‌ రెడ్డితో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. దశల వారీగా బకాయిలను విడుదల చేసేందుకు సర్కారు అంగీకరిచడంతో రేషన్‌ డీలర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

కనీస వేతనంపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేషన్‌ డీలర్ల సంఘం నేతలు చెప్పారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కనీస వేతనం, బకాయిలు, ఆరోగ్య కార్డుల సమస్యలు పరిష్కరిస్తామన్నారని వివరించారు. రేషన్‌ డీలర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారని, అయితే, నెల రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

More Telugu News