Telangana: మ‌ల్బ‌రీ సాగుపై దృష్టి పెట్టండి.. ఎకరానికి నాలుగు లక్షలు సంపాదించండి!: తెలంగాణ మంత్రి జూప‌ల్లి సూచన

  • మ‌ల్బ‌రీ సాగుతో అధిక ఆదాయం
  • దేశంలో ప‌ట్టు ప‌రిశ్ర‌మకు మంచి భ‌విష్య‌త్‌
  • చైనాతో పోల్చితే దాదాపు ప‌ది రెట్లు వెనుక‌బ‌డి ఉన్నాం

ప‌ట్టు ప‌రిశ్ర‌మ ద్వారా ఉపాధి అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని... సాంప్ర‌దాయ పంట‌ల‌తో పాటు అధిక ఆదాయం ఇచ్చే మ‌ల్బ‌రీ సాగు లాంటి పంట‌ల సాగు వైపునకు కూడా రైతులు దృష్టి సారించాల‌ని తెలంగాణ పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సూచించారు. హైదరాబాద్‌లో ఈరోజు జ‌రిగిన‌ పట్టు రైతుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... 2017 నాటికి ప‌ట్టు ఉత్ప‌త్తిలో చైనా మొదటి స్థానంలో నిలవగా... దాదాపు ప‌దిరెట్లు వెనుక‌బ‌డిన ఇండియాకు రెండో స్థానం ద‌క్కింద‌ని మంత్రి జూప‌ల్లి అన్నారు.

పట్టును అమెరికా, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్‌తో పాటు ఇండియా కూడా ఎక్కువ‌గా దిగుమతి చేసుకుంటుంద‌ని... ప‌ట్టు ఉత్ప‌త్తుల‌కు ఇండియాలో మంచి గిరాకీ ఉంద‌ని అన్నారు. దీని ద్వారా చైనాలో సుమారు 10 లక్షల మందికి ఉపాధి క‌లుగుతుంటే... ఇండియాలో మాత్రం కేవ‌లం 80 వేల మందే ఉపాధి పొందుతున్నార‌న్నారు. భారతదేశంలో 45 వేల మెట్రిక్ టన్నుల పట్టుకు డిమాండ్ ఉండగా, ప్రస్తుతం 31,000 మెట్రిక్ టన్నులు మాత్ర‌మే ఉత్ప‌త్తి చేసుకోగ‌లుగుతున్నామ‌ని...గ‌త ఏడాది దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల ప‌ట్టును చైనా నుండి దిగుమతి చేసుకున్నామన్నారు.

మ‌న దేశంలో 9571 మెట్రిక్ టన్నుల ప‌ట్టు ఉత్ప‌త్తితో క‌ర్ణాట‌క‌ మొదటి స్థానంలో నిలవగా... 119 మెట్రిక్ ట‌న్నుల ఉత్ప‌త్తితో తెలంగాణ ఐద‌వ స్థానంలో నిలిచింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టిందని, మల్బరి సాగు, పట్టు గూళ్ల ఉత్పత్తి వలన రైతులకు కలిగే ప్రయోజనాలపై విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఒక ఎకరం మల్బరి సాగు చేయడం వలన ఐదుగురికి ఏడాది పొడవునా పని కల్పించవచ్చని... ఏడాదిలో 8 నుండి 10 పంట‌లు సాగు చేయ‌వ‌చ్చని మంత్రి జూపల్లి అన్నారు. ఎక‌రానికి దాదాపుగా నాలుగు ల‌క్ష‌ల ఆదాయాన్ని ఏడాదిలో ఆర్జించే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా పట్టుపురుగుల పెంపకం సాధ్యపడుతుందన్నారు.

జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా 70 శాతం రాయితీ ఇస్తూ మ‌ల్బ‌రీ షెడ్ల నిర్మాణాన్ని ప్రోత్స‌హిస్తున్నామ‌ని... అటు ఉద్యాన‌వ‌న శాఖ కూడా మిగిలిన 30 శాతాన్ని రాయితీగా ఇస్తుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్టు దారం-రైతు జీవ‌నాధారం బుక్‌లెట్‌ను, సీడీని మంత్రి జూప‌ల్లి ఆవిష్క‌రించారు. తెలంగాణావ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది ప‌ట్టు రైతులు ఈ స‌ద‌స్సులో పాల్గొన‌గా... ఉద్యాన‌వ‌న శాఖ డైరెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి, నాబార్డ్ సీజీయం విజ‌య్‌కుమార్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ ఆశ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News