West Bengal: పొరుగింటి మహిళ ఇంటి బాత్రూంలో స్పై కెమెరా అమర్చిన వ్యాపారవేత్త.. ఫేస్ బుక్ లో వీడియో.. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు!

  • మహిళకు తెలియకుండా 45 నిమిషాల వీడియో చిత్రీకరణ
  • ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడంతో వెలుగులోకి
  • కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులు

పొరుగింటి మహిళతో పరిచయం పెంచుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమెకు తెలియకుండా స్నానాల గదిలో స్పై కెమెరా అమర్చాడు. తర్వాత ఆమె స్నానం చేస్తుండగా రికార్డయిన వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. విషయం తెలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెదిరింపులకు దిగాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో జరిగిందీ ఘటన. వ్యాపారవేత్త అయిన నిందితుడి కోసం ఇప్పుడు పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం..

బఖరాపూర్‌కు చెందిన ఇమ్రుల్ షేక్ వస్త్ర వ్యాపారి. బాధిత మహిళ పొరుగింట్లో ఉండేవాడు. దీంతో మహిళ కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది. తరచూ వారింట్లోకి వచ్చి వెళ్తుండేవాడు. ఇటీవల మరోమారు ఆమె ఇంటికి వచ్చిన నిందితుడు మహిళకు తెలియకుండా నేరుగా బాత్రూమ్‌లోకి వెళ్లి సీక్రెట్ కెమెరా అమర్చి వెళ్లిపోయాడు. ఆ కెమెరా సాయంతో 45 నిమిషాల నిడివి ఉన్న వీడియోను చిత్రీకరించాడు. దీనిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు.

గ్రామానికే చెందిన కొందరు అది చూసి బాధిత మహిళకు చెప్పారు. దీంతో గ్రామస్తులతో కలిసి మహిళ కుటుంబ సభ్యులు ఇమ్రుల్ ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. తానే వీడియో తీసి అప్‌లోడ్ చేశానని ఇమ్రుల్ తన తండ్రి ఎదురుగానే అంగీకరించాడు. పోలీసుల వరకు వెళ్లవద్దని డబ్బు ఆశ చూపి వారిని శాంతింపజేయాలని ప్లాన్ వేశాడు. అయినప్పటికీ లొంగని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధిత మహిళను నిందితుడు హెచ్చరించాడు.

నిందితుడిని ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. ఇమ్రుల్ తండ్రి స్థానిక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కావడంతో అరెస్ట్ చేయడం లేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కాగా, వివాదం రోజురోజుకు మరింత పెద్దది అవుతుండంతో స్పందించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News