kiran kumar reddy: సమయం వచ్చినప్పుడు అన్నీ చెపుతా: కిరణ్ కుమార్ రెడ్డి

  • కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన ఊమెన్ చాందీ
  • మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలంటూ కిరణ్ కు ఆహ్వానం
  • సమావేశానికి హాజరైన పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయన... ఆ తర్వాత బహిరంగంగా కనిపించింది కూడా చాలా తక్కువే. అయితే, ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని బలపరుస్తూ... ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ ఈరోజు హైదరాబాదులోని కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా హాజరయ్యారు.

భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ లో చేరుతున్నాననేవి కేవలం వార్తలు మాత్రమేనని... సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని తెలిపారు. ఊమెన్ చాందీ మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే కాకుండా, యావత్ దేశానికే కీలక సమయమని చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కాంగ్రెస్ ను వీడిన నేతలందరినీ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించామని... తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఆయనే అని తెలిపారు.

More Telugu News