USA: దివ్యాంగుడైన ఐదేళ్ల బిడ్డను భారత మహిళ నుంచి దూరం చేసిన అమెరికా అధికారులు!

  • మెక్సికో నుంచి అమెరికాలోకి ప్రవేశించిన భావన్ పటేల్
  • అరెస్ట్ చేసి బిడ్డను వేరు చేసిన అధికారులు
  • 'ది వాషింగ్టన్ పోస్ట్' కథనం

వలసదారులు, అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న అధికారులు, తాజాగా, ఓ భారతీయ మహిళ నుంచి ఆమె బిడ్డను దూరం చేశారు. 'వాషింగ్టన్ పోస్ట్' ప్రచురించిన కథనం ప్రకారం, భావన్ పటేల్ (33) అనే మహిళను, మెక్సికో నుంచి చట్ట విరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిందని ఆరోపిస్తూ, అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆమెకు ఐదేళ్ల బిడ్డ ఉండగా, అతను దివ్యాంగుడు. ఆ బిడ్డను బలవంతంగా స్వాధీనం చేసుకుని బాలల శిబిరానికి తరలించారు. అమెరికాలో 'జీరో టాల్ రెన్స్' పాలసీ అమలులోకి వచ్చిన తరువాత, ఓ భారత మహిళ నుంచి బిడ్డ వేరు పడటం ఇదే తొలిసారి. దాదాపు 2 వేల మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల నుంచి అధికారులు దూరం చేశారు.

కాగా, ఆరిజోనా కోర్టులో 30 వేల డాలర్ల బాండ్ ను భావన్ పటేల్ చెల్లించి బయటకు వచ్చినట్టు తెలుస్తుండగా, తన బిడ్డను ఆమె కలిశారో లేదో తెలియరాలేదు. ఈ వారం ప్రారంభంలో వలసదారుల నుంచి పిల్లలను వేరు చేయాలన్న తన కఠిన నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. పటేల్ అరెస్ట్ ఎప్పుడు జరిగిందన్న విషయమై పత్రిక ఎటువంటి సమాచారాన్నీ ప్రచురించలేదు.

More Telugu News