తాను పౌరోహిత్యం చేస్తోన్న ఇళ్లల్లోనే దొంగతనాలు చేస్తోన్న పూజారి!

29-06-2018 Fri 19:41
  • విజయవాడలో ఘటన
  • గవర్నర్‌పేటలో అనుమానాస్పదంగా కనపడ్డ పూజారి 
  • పట్టుకుని విచారించిన పోలీసులు

ఇంటింటికీ తిరిగి పూజలు చేసుకునే ఓ పూజారి దొంగతనాలకు పాల్పడుతోన్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. తాను పౌరోహిత్యం చేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని, ఆ పూజారి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి చోరీలు చేస్తున్నాడు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో దొంగతనాలు చేస్తోన్న ఆయన... ఈరోజు గవర్నర్‌పేటలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనపడ్డాడు.

అతడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో పూజారి బాగోతం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రూ.1.25 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఆ పూజారి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన శివ సుబ్రహ్మణ్యం అని, గతంలోనూ తన స్నేహితుడితో కలిసి దొంగతనాలు చేసి జైలుకు వెళ్లివచ్చాడని పోలీసులు చెప్పారు.