Madhya Pradesh: అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు భూమికే భారం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

  • అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు జీవించే హక్కు లేదు
  • ఈ కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా కోర్టులు చూడాలి
  • ఈ మేరకు సుప్రీం, హైకోర్టులకు విజ్ఞప్తి చేస్తున్నా

మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు జీవించే హక్కు లేదని, అటువంటి వ్యక్తులు భూమికే భారమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మంగళవారం మధ్యప్రదేశ్ లోని మాందసౌర్ లో ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ నిందితుడు అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భోపాల్ లోని తన నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చౌహాన్ మాట్లాడుతూ, ఇలాంటి దుర్మార్గులు భూమికే భారమని, వారికి జీవించే హక్కు లేదని అన్నారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వ పర్యవేక్షణలో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ఆమె కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారని అన్నారు. ఇలాంటి కేసుల సత్వర పరిష్కారం కోసమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కేసుల్లో నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కఠినశిక్ష పడేలా చూస్తామని చెప్పారు.

More Telugu News