Online: అమ్మ కోసం వన్ ప్లస్ 6 ఆర్డర్ చేస్తే... మార్బుల్ ముక్కలొచ్చాయి!

  • ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఢిల్లీ యువకుడు
  • తమ తప్పు లేదని చెప్పిన ఈ-కామర్స్ సంస్థ
  • పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

మాతృ దినోత్సవం సందర్భంగా కన్నతల్లికి బహుమతి ఇద్దామనుకుని ఆన్ లైన్లో వన్ ప్లస్ 6 ఫోన్ ను ఆర్డర్ చేసి రూ. 34,999ను డెబిట్ కార్డు ద్వారా కట్టిన ఢిల్లీ యువకుడికి పార్శిల్ లో మార్బుల్ ముక్కలు వచ్చాయి. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మానస్ సక్సేనా అనే యువకుడు తన తల్లి యోజనా సక్సేనాకి మదర్స్ డే సందర్భంగా కానుక ఇవ్వదలచి, ఆన్ లైన్లో ఓ ఈ-కామర్స్ సంస్థను సంప్రదించి స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇచ్చి డబ్బు కట్టాడు.

డెలివరీ అయిన తరువాత ఫోన్ ను ఓపెన్ చేయకుండా అలాగే తీసుకెళ్లి తల్లికి బహుమతిగా ఇచ్చాడు. తర్వాత తల్లి తనయుడి సమక్షంలో ఆత్రుతగా దానిని విప్పి చూడగా.. ఇద్దరూ షాక్ అయ్యారు. ఎందుకంటే, అందులో ఒక పెద్ద మార్బుల్ ముక్కతో పాటు చిన్న చిన్న ముక్కలు కూడా వున్నాయి. దీంతో కంగుతిన్న ఆమె, ఫోన్ లో సదరు ఈ-కామర్స్ సైట్ ను సంప్రదించగా, ఇందులో తమ తప్పులేదని, ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని సూచించారు.

అయితే, ఫిర్యాదు తీసుకున్ననెల రోజుల తరువాత, డెలివరీ బాయ్ తప్పు కూడా లేదని సదరు సంస్థ తేల్చేసింది. దీంతో తాజాగా ఆమె వసంత్ కుంజ్ పోలీసులను ఆశ్రయించారు. బాక్సు తమకు డెలివరీ చేసినప్పుడు సీల్డ్ ప్యాక్ లా అనిపించిందని, తీరా పరిశీలనగా చూడడంతో ట్యాంపర్ చేసినట్టు స్పష్టంగా కనిపించిందని యోజనా సక్సేనా చెప్పారు. కేసు స్వీకరించిన పోలీసులు 420 కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

More Telugu News