Uttar Pradesh: పదండి యోగీ జీ... తాజ్ మహల్ ను కూల్చేద్దాం!: ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు

  • యోగి తొలి దెబ్బ వేస్తే నేను రెండో దెబ్బ వేస్తా
  • నాతో పాటు 20 వేల మంది పలుగు, పారలతో వస్తారు
  • సమాజ్ వాదీ నేత ఆజంఖాన్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ తో కలసి పర్యాటక క్షేత్రం తాజ్‌ మహల్‌ ను కూల్చేందుకు తాను సిద్ధమేనని సమాజ్‌ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తాజ్ మహల్‌ శివాలయమని ఆదిత్యనాథ్ చెబుతున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, తాజ్ ను పడగొట్టేందుకు బీజేపీ కదిలితే, తానూ కలిసొస్తానని అన్నారు.

ఓ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన, "నిజానికి తాజ్ మహల్ శివాలయం అని యోగి సహా పలువురు నాతో చెప్పారు. అందువల్ల శివాలయాన్ని మళ్లీ శివాలయంగా మార్చేందుకు, ఓ ముస్లింగా నేను కూడా నడుస్తాను. నాతో పాటు మరో 20 వేల మంది పలుగు, పారలతో యోగి వెంట నడుస్తాం" అని తెలియజేశారు. ఆదిత్యనాథ్ తో భుజం, భుజం కలిపి నడుస్తానని, తాజ్ మహల్‌ పై యోగి తొలి దెబ్బ వేస్తే, రెండో దెబ్బ తానే వేస్తానని ఆయన అన్నారు. తాజ్ మహల్ బానిసత్వానికి సూచికని ఆజంఖాన్ వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, ఈ సంవత్సరం హిందూ మహాసభ అలీగఢ్ యూనిట్ విడుదల చేసిన క్యాలెండర్ లో తాజ్ మహల్‌ ను 'తేజో మహాలయ్ శివ మందిర్'గా, కుతుబ్ మినార్‌ ను 'విష్ణు స్తంభం'గా, కాశీలోని జ్ఞాన్‌ వ్యాపి మసీదును 'విశ్వనాథ్ ఆలయం'గా పేర్కొన్నారు. 

More Telugu News