Narendra Modi: ప్రధానిగా మోదీ విదేశీ ఖర్చులు ఇప్పటి వరకు రూ.355 కోట్లు

  • మోదీ ప్రధాని హోదాలో 41 సార్లు విదేశీ పర్యటనలు చేశారు
  • ఇప్పటి వరకు 52 దేశాల్లో పర్యటించారు
  • 48 నెలల కాలంలో 165 రోజులు విదేశాల్లో బస చేశారు

2014 లో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన విదేశీ ప్రయాణాలకు అయిన ఖర్చులు రూ.355 కోట్లు. ఈ వివరాలను తెలియజేయాలని కోరుతూ బెంగళూరుకు చెందిన భీమప్ప గదాద్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు దరఖాస్తు చేశారు. ఈ మేరకు పీఎంఓ వాటి వివరాలను తెలిపింది.

మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 41 సార్లు విదేశీ పర్యటనలు (52 దేశాలు) చేశారని, 48 నెలల కాలంలో 165 రోజులు విదేశాల్లోనే ఆయన బస చేశారని, ఇందుకు గాను రూ.355 కోట్లు ఖర్చయిందని తెలిపింది. ఈ సందర్భంగా మోదీ చేసిన 41 పర్యటనలలో.. భూటాన్ పర్యటనలో అత్యల్పంగానూ, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా పర్యటనలో అత్యధికంగానూ ఖర్చయింది. 2014 లో భూటాన్ పర్యటనకు మోదీ వెళ్లినప్పుడు రూ. 2,45,27,465, ఇక 2015 లో ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో మోదీ తొమ్మిది రోజులు పర్యటించగా రూ. 31,25,78,000 ఖర్చయినట్టు పేర్కొంది.

కాగా, ఈ వివరాలు తెలుసుకున్న భీమప్ప మాట్లాడుతూ, మోదీ విదేశీ పర్యటనలకే ఎక్కువ నిధులు ఖర్చవుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ విషయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తనకు కలిగిందని చెప్పారు. అందుకే, ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం తెలుసుకున్నానని, అంతే తప్ప, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు.

More Telugu News