Aadhar card: హిజ్రాకు ఆధార్ కార్డు.. అండగా నిలిచిన న్యాయమూర్తి!

  • ఆధార్ లేక సంక్షేమ పథకాలకు దూరమైన కనిమొళి
  • న్యాయమూర్తిని కలిసి ఆవేదన
  • ఆమె చొరవతో ఆధార్ దరఖాస్తు చేయించిన అధికారులు

ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న ఓ హిజ్రాకు అధికారులు ఆధార్ కావాలని అడిగారు. అది లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు ఆమె లబ్ధిదారు కాలేకపోయింది. దీంతో ఆమెకు అండగా నిలిచిన న్యాయమూర్తి ఆధార్ ఇప్పించారు. చెన్నైలోని అన్నానగర్ ప్రాంతంలో కనిమొళి (33) అనే హిజ్రా నివసిస్తోంది. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్న ఆమె మూడేళ్ల క్రితం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆధార్ కార్డు లేదన్న ఒకే ఒక్క కారణంతో ఆమె పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు అధికారులు నిరాకరించారు. మూడేళ్లపాటు అధికారుల కాళ్లా వేళ్లా పడినా ప్రయోజనం లేకపోయింది.

ఇటీవల చెన్నై జిల్లా న్యాయసేవా సంఘం కార్యదర్శి, న్యాయమూర్తి జయంతిని కలిసిన కనిమొళి తన ఆవేదనను ఆమెతో పంచుకున్నారు. మూడేళ్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి జయంతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చొరవతో అధికారులు దగ్గరుండి ఆధార్‌కు దరఖాస్తు చేయించారు. మరికొన్ని రోజుల్లోనే ఆమెకు ఆధార్ రానుంది. మరోమారు న్యాయమూర్తి జయంతిని కలిసిన కనిమొళి తనకు సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

More Telugu News