YSRCP: వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయట్లేదు: ఎమ్మెల్సీ డొక్కా

  • ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర మంత్రి స్పందించిన తీరు దారుణం
  • రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తుక్కుతుక్కుగా ఓడిస్తారు

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవకాశంపై టాస్క్ ఫోర్స్ పని చేస్తోందని, భూములు ఎంత మేరకు అవసరమన్నది కన్సల్టెన్సీ సంస్థ చెబుతుందని కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్   పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై బీరేంద్ర స్పందించిన తీరు దారుణంగా ఉందని విమర్శించారు.

రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తుక్కుతుక్కుగా ఓడిస్తారని అన్నారు. కాగా, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ, ఉక్కు పరిశ్రమకు ఖనిజం ఎక్కడి నుంచి లభిస్తుందో కేంద్రానికి స్పష్టంగా వివరించామని చెప్పారు. ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్ చేస్తున్న దీక్షతో కేంద్రంలో కొంత కదలిక వచ్చిందని అభిప్రాయపడ్డారు.

More Telugu News