Hyderabad: థియేటర్‌లో రూ.2.11 లక్షలు పోగొట్టుకున్న ప్రేక్షకుడు.. తిరిగిచ్చి నిజాయతీ చాటుకున్న సిబ్బంది!

  • నోట్ల కట్ట జేబులో పెట్టుకుని సినిమాకు
  • సీటు కింద పడినా గుర్తించని వైనం
  • పోలీసులకు అందించిన సిబ్బంది

బావమరిదికి పెళ్లి కానుకగా ఇవ్వాలనుకున్న డబ్బులను జేబులో పెట్టుకుని సినిమా చూసేందుకు వచ్చిన ఓ ప్రేక్షకుడు పొరపాటున వాటిని థియేటర్‌లోనే పోగొట్టుకున్నాడు. హాలును శుభ్రం చేస్తున్న సమయంలో నోట్ల కట్టను గమనించిన సిబ్బంది వాటిని బాధిత ప్రేక్షకుడికి అప్పగించి తమ నిజాయతీ చాటుకున్నారు. హైదరాబాద్ ఆనంద్‌బాగ్‌లోని సినీపాలిస్ థియేటర్‌లో జరిగిందీ ఘటన.

మల్కాజిగిరికి చెందిన జి.నారాయణరావు తన బావమరిదికి పెళ్లి కానుకగా ఇవ్వాల్సిన రూ.2.11 లక్షలను తీసుకుని జేబులో పెట్టుకుని బయలుదేరాడు. వెళ్తూవెళ్తూ ఆనంద్‌బాగ్‌లోని సినీపాలిస్‌లో సినిమా చూశాడు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అతడి జేబులోని నోట్ల కట్ట జారి కిందపడింది. అయితే, అది గమనించకుండానే వెళ్లిపోయాడు.

సినిమా ముగిసిన తర్వాత థియేటర్‌ను పరిశీలిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి ఓ సీటు కింద నోట్ల కట్ట కనిపించింది. దానిని చూసి ఆశ్చర్యపోయిన వారు దానిని తీసుకెళ్లి నిజాయతీగా మేనేజరు  వినోద్‌కుమార్‌, సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ సాయికుమార్‌లకు అప్పగించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈలోగానే బాధితుడు నారాయణరావు థియేటర్‌కు వచ్చి డబ్బులు పోయినట్టు చెప్పడంతో ఆయనను అక్కడి సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ తాను పోగొట్టుకున్న సొమ్ము, ఏ నోట్లు ఎన్ని ఉన్నాయో కచ్చితంగా చెప్పడంతో పోలీసులు బాధితుడు అతడే అని గుర్తించి సొమ్ము అతడికి అందించారు. అంత డబ్బు చేతికి చిక్కినా నిజాయతీగా అప్పగించిన థియేటర్ సిబ్బందిని పోలీసులు అభినందించారు.

More Telugu News