Kadapa: అత్యవసరంగా కడపకు వెళ్లాలని గంటా శ్రీనివాస్ ను ఆదేశించిన చంద్రబాబు!

  • కడపలో ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవి
  • వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గంటాను పంపిన చంద్రబాబు
  • నేడు ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తో టీడీపీ ఎంపీల సమావేశం

కడపలో ఉక్కు ప్లాంటు ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల ఆరోగ్యం మరింతగా విషమిస్తుండటంతో పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసరంగా కడపకు వెళ్లాలని మంత్రి గంటా శ్రీనివాస్ ను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వీరి దీక్షలు ముగిసేవరకూ కడపలోనే ఉండాలని కూడా గంటాను చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది. దీక్ష చేస్తున్న ఇద్దరితో చర్చించి, వారు ఆసుపత్రికి వెళ్లేలా చూడాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. సీఎం ఆదేశాలను అందుకున్న మంత్రి గంటా, ఈ ఉదయం కడపకు బయలుదేరారు.

ఇదిలావుండగా, నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలుగుదేశం ఎంపీలు, 11.30 గంటలకు పార్టీ పార్లమెంటరీ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఏపీలో పరిస్థితిని చర్చించిన అనంతరం, మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తో ప్రత్యేకంగా సమావేశమై ఉక్కు కర్మాగారంపై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయనున్న పార్లమెంట్ సభ్యులు, ఆ మేరకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని పట్టుబట్టనున్నట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి స్పందన తరువాత తదుపరి కార్యాచరణ ప్రణాళికను తెలియజేస్తామని ఎంపీలు అంటున్నారు.

More Telugu News