Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు మరోసారి లేఖ రాసిన కేవీపీ

  • నిన్న గడ్కరీకి మీరు రాసిన లేఖ చూసి నాకు ఆశ్చర్యం కలిగింది
  • ‘పోలవరం’ పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించాల్సి ఉంది
  • రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారానికి పూర్తి బాధ్యత బాబుదే

పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి గడ్కరీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిన్న లేఖ రాశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు ఓ లేఖ రాశారు.

‘జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన పోలవరానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ మీరు నిన్న గడ్కరీ గారికి రాసిన లేఖను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించవలసి ఉంది. అయితే, మీకు-మోదీ గారికి ఏ ఒప్పందం జరిగిందో తెలియదు కానీ పోలవరాన్ని కేంద్రానికి బదులుగా రాష్ట్రమే నిర్మిస్తుందని కేంద్రంతో చెప్పించి - నిర్మాణం మీ చేతుల్లోకి తీసుకొన్నారు.

ఇలా నిధుల విషయంలో క్లారిటీ లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేతుల్లోకి తీసుకొంటే.. ఈ ప్రాజెక్ట్ ఖర్చు రాష్ట్రంపై పడుతుందని నేను గతంలో అనేక లేఖల ద్వారా మిమ్మల్ని హెచ్చరించి ఉన్నాను.  అదే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చును 2013-14 రేట్ల అంచనాల ప్రకారమే ఇస్తామని, కాస్ట్ ఎస్కలేషన్ భారం రాష్ట్రమే భరించాలని కేంద్రం ప్రకటించినప్పుడే, దాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు ఇది విభజన చట్టానికి వ్యతిరేకమని, ఈ కండిషన్ కు ఒప్పుకోవద్దని కూడా మిమ్మల్ని పలు లేఖల ద్వారా హెచ్చరించాను.  

కానీ, మీరు నా లేఖలను నిర్లక్ష్యం చేసినందున, కేంద్రం పెట్టిన కండిషన్ లకు ఒప్పుకొంటూ ప్రాజెక్ట్ నిర్మాణం చేతుల్లోకి తీసుకున్నందున.. పోలవరం ఖర్చు రాష్ట్ర ఖజానాపై పడకూడదనే ఉద్దేశ్యంతో.. పోలవరం పూర్తి ఖర్చు విభజన చట్టం ప్రకారం కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాను. ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలైనా ఇంతవరకు కౌంటర్ కూడా వేయలేదు.    

ఇక పోలవరం నిధుల కోసం లేఖ రాస్తూ, పోలవరం విభజన చట్టం సెక్షన్ 90 లో జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించబడింది అని గడ్కరీ గారికి గుర్తు చేసిన మీరు, సెక్షన్ 90 (2) లో పోలవరాన్ని కేంద్రమే చేపట్టి పూర్తి చేయాలనీ, సెక్షన్ 90 (4) లో పోలవరానికి ఇంకా అవసరమైన అన్ని అనుమతులు, పునరావాస కార్యక్రమాలు మొత్తం కేంద్రం చేయాలన్న మాటలను గుర్తు చేయకుండా మీ లేఖ 9వ పేరాలో భూసేకరణ, పునరావాసాలకు ‘స్పెషల్ కేసు’ గా పరిగణించి నిధులు విడుదల చేయాలని ప్రాధేయపడ్డారు. చట్టంలో ప్రాజెక్ట్ ను పూర్తిగా కేంద్రమే చేపట్టి, పూర్తి చేయాలని స్పష్టంగా ఉంటే, చట్ట ప్రకారం వ్యవహరించమని కేంద్రాన్ని కోరకుండా.. స్పెషల్ కేసుగా పరిగణించి నిధులు విడుదల చేయమనడం ఎందుకో అర్థం కావడం లేదు.  
 
ఇప్పటికే.. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్రం తీసుకొన్న కారణంగా ‘కాస్ట్ ఎస్కలేషన్’ భారం రాష్ట్ర ఖజానాపై పడింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) 7వ మీటింగ్ లో కేంద్ర అధికారులే భూ సేకరణ, పునరావాస కార్యక్రమాలకు కావలసిన నిధులు మీరు ఎలా సమకూర్చుకొంటారని రాష్ట్రాన్ని అడగడం.. దానికి మీ అధికారులు నీళ్లు నమలడం చూసినప్పుడే.. విభజన చట్టానికి విరుద్ధంగా ఆ భారం కూడా రాష్ట్రంపై వేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని - దీనిపై వెంటనే కేంద్రాన్ని వివరణ కోరాలని మీకు మరో లేఖ రాశాను.

 కానీ, కేంద్రాన్ని వివరణ కోరకపోగా.. ఇప్పుడు స్పెషల్ కేసుగా పరిగణించి భూసేకరణ, పునరావాస కార్యక్రమాల నిధులు విడుదల చేయమని కోరడంతో.. మీరు ఈ నిధుల భారం కూడా రాష్ట్ర ఖజానాపై వేయడానికి ఒప్పుకొనే నిర్మాణం మీ చేతుల్లోకి తీసుకొన్నారని- అందుకే, మీరు ఇప్పుడు ఈ ‘స్పెషల్’ ప్రార్థన లు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తున్నది.  

అంతే కాక.. విభజన చట్టం అమలుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేసులో రాష్ట్రం తరుపున కౌంటర్ వేయించిన మీరు- పోలవరం కేసులో కనీసం కౌంటర్ వేయమని కూడా ఆదేశించక పోవడం చూస్తుంటే.. పోలవరం విషయంలో మీరు ఏదో దాస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ విషయంలో ప్రజలకు ఒక స్పష్టతను ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది.  
 
ఇప్పటికైనా, కనీసం భూసేకరణ, పునరావాస కార్యక్రమాలనైనా కేంద్ర ఆధ్వర్యంలో విభజన చట్టం చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా చేయించ గలిగితే.. రాష్ట్రాన్ని కొంతమేరకైనా ఆర్థిక భారం నుంచి కాపాడగలిగినవారు అవుతారు. లేదంటే.. రాష్ట్ర ఖజానాపై పడే ఈ అదనపు భారానికి పూర్తి బాధ్యత పూర్తిగా మీదే అవుతుంది. గ్రహించండి’ అని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు.

More Telugu News