New Delhi: అయ్యా.. మీరు ఫిట్‌గానే ఉన్నారు.. త్వరగా ఢిల్లీ వేంచేయండి: కేజ్రీవాల్‌కు ఢిల్లీ బీజేపీ చీఫ్ లేఖ

  • చికిత్స కోసం గతవారం బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్
  • త్వరగా రావాలన్న మనోజ్ తివారీ
  • ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని లేఖ
‘‘వర్షాకాలం వచ్చేస్తోంది. త్వరగా ఢిల్లీకి వచ్చి ఆ మురికి కాలువల పనేదో త్వరగా చూడండి’’ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ లేఖ రాశారు. నేచురోపతి (ప్రకృతి వైద్య చికిత్స) ట్రీట్‌మెంట్‌ కోసం కేజ్రీవాల్ బెంగళూరు వెళ్లారు.

ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ ఆయనకు లేఖ రాస్తూ..‘‘ఇప్పటికే మీరు వెళ్లి పది రోజులు అయింది, మీరు ఫిట్‌గానే ఉన్నారని వైద్యులు చెప్పారు. కాబట్టి త్వరగా ఢిల్లీ వచ్చి మురికి కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టండి. వర్షాకాలం ముంచుకొస్తోంది, కాబట్టి వీలైనంత త్వరగా ఆ పనులు చేపట్టిండి’’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే, నీటి సమస్య, కరెంట్ కోతలు, కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, వాటి పైనా దృష్టి సారించాలని కోరారు.

కేజ్రీవాల్ గతవారం వైద్య చికిత్స కోసం బెంగళూరు వెళ్లారు. గవర్నర్ కార్యాలయంలో తొమ్మిది రోజుల ఆందోళన తర్వాత ఆయన అధిక రక్తపోటుకు గురయ్యారు. దీంతో పది రోజుల చికిత్స నిమిత్తం బెంగళూరు వెళ్లారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన చికిత్స పొందుతున్న జిందాల్ నేచురోపతి ఇనిస్టిట్యూట్ అధికారి ఒకరు తెలిపారు.
New Delhi
Arvind Kejriwal
Bangaluru
Manoj tiwari

More Telugu News