Hyderabad: వర్షపు నీటి సంరక్షణ, వినియోగానికి వారంలోగా ప్రణాళికను రూపొందించండి: అధికారులకు తెలంగాణ సీయస్ ఆదేశం

  • వచ్చే 2 సంవత్సరాలకు ప్రణాళికలు రూపొందించాలి
  • ఇప్పటివరకు 2.20 లక్షల హెక్టార్లకు మైక్రో ఇరిగేషన్ సౌకర్యం
  • 2018-19 లో మరో 1.18 లక్షల హెక్టార్లకు ఈ సౌకర్యం

కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి అధ్యక్షతన రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశమయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో వర్షపు నీటి సమర్ధ సంరక్షణ, వినియోగానికి సంబంధించిన ముసాయిదా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా సీయస్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఏర్పడిన తరువాత వివిధ పంటల వారీగా ఉత్పత్తి, ఉత్పాదకత, రిజర్వాయర్లలో నీటి నిలవ సామర్ధ్యం పెంపు, అటవీ విస్తీర్ణం పెరుగుదల, భూగర్భజలాలు, చెరువుల పరిస్ధితి తదితర అంశాలపై వచ్చిన గుణాత్మక ఫలితాలను నివేదికలో పొందుపరచడంతో పాటు వచ్చే 2 సంవత్సరాలకు సంబంధించిన దీర్ఘకాల, స్వల్పకాలిక ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అలాగే ఇరిగేషన్ కు సంబంధించి మేజర్, మీడియం, మైనర్ ల ద్వారా 62 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియల్ ను క్రియేట్ చేయటం జరిగిందని, మిషన్ కాకతీయ ద్వారా 17వేల 860 వాటర్ బాడీస్ ను రీస్టోర్ చేసి 12.47 లక్షల ఎకరాల ఆయకట్టును స్ధిరీకరించినట్టు తెలిపారు.

2014 సంవత్సరం తరువాత 211 కోట్ల రూపాయలతో 67 కొత్త చెక్ డ్యాంలు మంజూరు చేశామని, జైకా నిధుల ద్వారా 79 కొత్త ట్యాంకులను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 2.20 లక్షల హెక్టార్లకు మైక్రో ఇరిగేషన్ సౌకర్యాన్ని కల్పించామని, 2018-19 లో మరో 1.18 లక్షల హెక్టార్లకు ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఈ సందర్భంగా సీయస్ తెలిపారు. ఈ పద్ధతి ద్వారా పంటలకు వాడే నీటిని ఆదా చేశామని, ఉత్పాదకత పెరిగిందని అధికారులు సీయస్ కు వివరించారు. కాగా, ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News