danam nagender: వైయస్ లాంటి దమ్మున్న నేత కాంగ్రెస్ లో ఒక్కరైనా ఉన్నారా?: దానం నాగేందర్

  • పార్టీలు మారి వచ్చిన వారికి అత్యున్నత పదవులు లభించాయి
  • పార్టీ కోసం పని చేసిన వారికి మాత్రం అన్యాయం జరిగింది
  • ఆత్మాభిమానం చంపుకోలేకే రాజీనామా చేశా

పార్టీలు మారి కాంగ్రెస్ లో చేరిన వారిలో ఎంతో మంది అత్యున్నత పదవులను చేపట్టారని... కానీ, పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వారిని మాత్రం పార్టీ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు తన వెంట ఎంత మంది కార్యకర్తలు వచ్చారో చూడాలని చెప్పారు. వీరందరికీ అన్యాయం జరిగిందని అన్నారు. మాకు అన్యాయం జరిగినా పర్వాలేదు... మీకు కూడా అన్యాయం జరిగితే ఎలా? అంటూ వీరందరూ తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని... ఆత్మాభిమానం చంపుకోలేకే కాంగ్రెస్ కు రాజీనామా చేశానని తెలిపారు.

గాంధీభవన్ కానీ, సభల్లో కాని ఎవరెవరు ఉంటారో, ఎవరెవరు మాట్లాడతారో మీరే చూడాలని అన్నారు. తాను ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటానని ఉత్తమ్ అనేకసార్లు చెప్పారని... కానీ, పక్కన ఉన్నవారు ఆయనను అడ్డుకుంటున్నారని చెప్పారు. వైయస్ లా పార్టీని కాపాడతానంటూ చెప్పగలిగే ధైర్యం కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడికైనా ఉందా? అని ప్రశ్నించారు. తాను ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ... పార్టీ ప్రతిష్టను కాపాడేందుకే యత్నించానని దానం తెలిపారు. తనకు ఇంత కాలం అండగా ఉన్న పెద్దలందరికీ ఫోన్లు చేసి... తాను పార్టీలో ఉండలేననే విషయాన్ని చెప్పానని అన్నారు. 

More Telugu News