danam nagender: ఉత్తమ్ బాగా పని చేస్తున్నా.. పీతల్లాగా ఆయనను కిందకు లాగుతున్నారు: దానం నాగేందర్

  • కాంగ్రెస్ లో బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదు
  • ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నారు
  • డీఎస్, కేకేలాంటి వాళ్లు అందుకే పార్టీని వీడారు

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తీరుతెన్నులను ఎండగట్టారు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను చేపట్టానని, హైదరాబాద్ మేయర్ గా కూడా పని చేశానని దానం నాగేందర్ చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు... పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఒకే సామాజికవర్గానికి ప్రమోషన్ లు ఇస్తున్నారనే విషయాన్ని తాను ఆయనకే చెప్పానని... దీంతో, అప్పటి హోం  మంత్రి జానారెడ్డితో వైయస్ మాట్లాడుతూ, ఇలా చేస్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పారు.

గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారని దానం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ లో పార్టీ కార్యక్రమం ఏది జరిగినా... బాధ్యతనంతా తన భుజాలపైనే వేసుకుని పని చేశానని... అయినా తనను విస్మరించారని అన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్ కు మళ్లీ పునర్వైభవం వస్తుందని పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా చెప్పానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదని మండిపడ్డారు.

 బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్లే డీఎస్, కేకేలాంటి వాళ్లు పార్టీని వీడారని చెప్పారు. ఒకే వర్గానికి చెందిన వారు మాత్రమే పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శక్తివంచన లేకుండా పని చేస్తున్నా... ఇతర నేతలు ఆయనను పీతల్లాగా కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీనియర్ నేత వీహెచ్ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

More Telugu News