Chandrababu: ఒకే గదిలో చంద్రబాబు-పవన్.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్!

  • గణపతి సచ్చిదానంద సమక్షంలో సమావేశం
  • ఆధ్యాత్మిక అంశాలపైనే చర్చ
  • బాగున్నారా సార్.. అని పలకరించిన పవన్

ఏపీలో ప్రస్తుతం టీడీపీ-జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సమయం దొరికినప్పుడల్లా ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అగ్ర నేతలు పావుగంటపాటు సమావేశం కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అన్నదానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

శుక్రవారం విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై రెయిన్ ట్రీ పార్క్ సమీపంలోని లింగమనేని ఎస్టేట్స్‌లో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు-పవన్‌లను గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి పిలిచి ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ వారు ముగ్గురూ పావుగంట పాటు సమావేశమై వివిధ అంశాల గురించి ప్రస్తావించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కాబట్టి రాజకీయాల గురించి వారు ప్రస్తావించి ఉండకపోవచ్చని అంటున్నారు. ఆధ్యాత్మిక అంశాలపై చంద్రబాబు-పవన్ చర్చించి ఉండొచ్చని చెబుతున్నారు. టీడీపీ వర్గాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి.
 
విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి చంద్రబాబు కంటే ముందే పవన్ తన సతీమణితో కలిసి చేరుకున్నారు. గర్భాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినప్పుడు పక్కపక్కనే నిల్చున్న చంద్రబాబు-పవన్ ఒకరి నొకరు పలకరించుకున్నారు. తొలుత పవన్ ‘సార్ బాగున్నారా?’ అని పలకరించారు. స్పందించిన సీఎం.. ‘బాగున్నాను.. మీరెలా ఉన్నారు?’ అని ప్రతిస్పందించారు. విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయ్యాక వేదపండితులు తొలుత పవన్‌కు ప్రసాదం ఇవ్వబోగా.. ‘‘కాదు, కాదు.. తొలుత సీఎం గారికి ఇవ్వండి’’ అని పవన్ అన్నారు. చంద్రబాబు పుచ్చుకున్నాక పవన్ తీసుకున్నారు. మొత్తానికి ఉప్పు-నిప్పులా ఉండే నేతలు ఇద్దరూ ఒకే గదిలో 15 నిమిషాలు కలిసి కూర్చుని మాట్లాడడం చర్చనీయాంశమైంది.

More Telugu News