Amit shah: పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్.. అమిత్ షా డైరెక్టర్ గా వున్న బ్యాంకుకు డిపాజిట్ల వెల్లువ!

  • పెద్ద నోట్ల రద్దుతో కొన్ని బ్యాంకులకు భారీ డిపాజిట్లు   
  • పెద్ద నోట్ల జమలో గుజరాత్ డీసీసీబీలు రికార్డు
  • సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి

నోట్ల రద్దుతో కొన్ని బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తాయంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. అలాంటి బ్యాంకుల్లో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ కూడా వుంది. మామూలుగా అయితే, దీనికి అంత ప్రాధాన్యత వచ్చేది కాదుగానీ, దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్ గా ఉండడమే విశేషమైంది. రద్దు అయిన నోట్లను జమచేసుకున్న సహకార బ్యాంకుల్లో దేశంలోనే ఆ బ్యాంకు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని రెండు జిల్లా సహకార బ్యాంకులకు నోట్ల రద్దు పుణ్యమాని పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చిపడ్డాయి. ఇందులో అహ్మదాబాద్‌ డీసీసీబీ ఒకటి కాగా, రెండోది రాజ్‌కోట్‌ డీసీసీబీ. ముంబైకి చెందిన మనోరంజన్‌ రాయ్‌ సమాచార హక్కు పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు.

నవంబరు 8, 2016లో ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత ఐదు రోజుల్లో అహ్మదాబాద్ డీసీసీబీలో ఏకంగా రూ. 745.59 కోట్ల విలువైన రద్దయిన నోట్లు జమయ్యాయి. రాజ్‌కోట్ డీసీసీబీలో రూ 693.19 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్ అయ్యాయి. అహ్మదాబాద్ డీసీసీబీకి 2000 సంవత్సరంలో షా చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో వేల కోట్లు జమ అయినా, జమ చేసిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరగలేదని ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్‌ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News