BJP: విజయాల వీరుడు రాంమాధవ్‌ను పక్కన పెట్టిన బీజేపీ?

  • విజయాలు అందించడంలో దిట్ట
  • కశ్మీర్‌లో పీడీపీతో పొత్తు వెనక ఉన్నది ఆయనే
  • రాం మాధవ్ స్థానంలో జీవీఎల్

బీజేపీ వ్యూహాల వీరుడు, రాష్ట్రమేదైనా పార్టీని గెలిపించగలిగే నేత రాంమాధవ్‌ను బీజేపీ పక్కనబెట్టిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పార్టీలో అమిత్ షా తర్వాత ఆయనకు అంత పేరుంది. అటువంటి వ్యక్తిని పార్టీ పక్కనపెడుతున్నట్టు వస్తున్న వార్తలతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కశ్మీర్‌లో పీడీపీతో బీజేపీ పొత్తు వెనక ఉన్నది కూడా ఆయనే. విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయనను ఇప్పుడు పార్టీ పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. కశ్మీర్ వైఫల్యంతో ఒక్కసారిగా ఆయన ప్రతిభ మసక బారింది.

పీడీపీతో రాం మాధవ్ మెతక వైఖరి వల్ల దేశవ్యాప్తంగా పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న భావనతోనే ఆ పార్టీతో బీజేపీ తెగదెంపులు చేసుకుందని తెలుస్తోంది. పీడీపీ ప్రభుత్వానికి రాంమాధవ్ తొలి నుంచీ అండగా నిలుస్తూ వస్తున్నారు. ఇది సహించలేని మోదీ-అమిత్ షాలు రాంమాధవ్‌కు మాటమాత్రమైనా చెప్పకుండానే పీడీపీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు, మోదీ సర్కారు వైఫల్యాలను రాం మాధవ్‌పై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అదే జరిగితే ఆయన రాజకీయ జీవితంపై పెను ప్రభావం పడుతుందంటున్నారు. రాం మాధవ్‌ను పట్టించుకోవడం మానేసిన మోదీ-అమిత్ షా ద్వయం ఇప్పుడు జీవీఎల్ నరసింహారావును ప్రోత్సహిస్తోంది.

కర్ణాటక ఎన్నికల సమయంలో అన్నీ తానై వ్యవహరించినా పార్టీని రాం మాధవ్ అధికారంలోకి తీసుకురాలేకపోయారు. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ వైఫల్యాలకు రాంమాధవ్‌ను బాధ్యుడిని చేస్తూ పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాం మాధవ్ దూకుడు ఇక తగ్గుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

More Telugu News