Pawan Kalyan: రమణదీక్షితులు చేపట్టే దీక్షకు మద్దతుగా నిలుస్తా!: పవన్ కల్యాణ్

  • రమణ దీక్షితులు గారు దీక్ష చేపడతానంటే ఎందుకు భయం?
  • టీడీపీ, వైసీపీలు ఎందుకు క్యాజువల్ గా తీసుకుంటున్నాయి?
  • శ్రీవారి నగలు దోచుకుపోయిన వారు నరకంలో కుళ్లిపోతారు

తిరుమల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘టీటీడీ ఆభరణాలు అదృశ్యమైన విషయమై వాస్తవాలు బయటపెట్టాలని కోరుతూ రమణ దీక్షితులు గారు దీక్ష చేపడతాననడంపై  ఏ రాజకీయ పార్టీ లేదా ఏ వ్యక్తి అయినా ఎందుకు భయపడుతున్నారు? ఈ దీక్షకు నేను మద్దతుగా నిలుస్తా. మేం ఇప్పటికే కోహినూర్ డైమండ్ కోసం పోరాడుతున్నాం. ఓపక్క తిరుమల శ్రీవారి పింక్ డైమండ్, ఇతర విలువైన ఆభరణాలు అదృశ్యం అయినప్పుడు.. ఈ విషయాన్ని టీడీపీ, వైసీపీలు ఎందుకు అంత క్యాజువల్ గా తీసుకుంటున్నాయి? ఆ రెండు పార్టీలు ఈ విషయంలో సీబీఐ విచారణకు ఒత్తిడి తెచ్చే వరకు దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ ఏ విధంగా ప్రతి స్పందిస్తాయా? అనే విషయమై దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

లార్డ్ బాలాజీ ఆభరణాలను ఎవరైతే దోచుకుపోయారో, వారికి ఎవరైతే సహకరించారో, వాళ్లందరూ నరకంలో కుళ్లిపోతారు. కలియుగ దైవం, లార్డ్ బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదు. తిరుమల శ్రీవారి నగలు అదృశ్యమైన విషయమై ఇంతకాలం రమణదీక్షితులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ.. ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు చూడకండి.. ఈ అంశాన్ని మీడియా ఇంతకుముందే హైలైట్ చేసింది. కానీ, ఈ అంశాన్ని ప్రభుత్వం పక్కదోవ పట్టించింది. ఈ వ్యవహారం నుంచి ఎటువంటి మచ్చ లేకుండా బయటపడమని టీడీపీని కోరుతున్నా’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

More Telugu News