Kadiam Srihari: హరితహారాన్ని ఈసారి విద్యాసంస్థల్లో భారీ ఎత్తున చేపట్టాలి: కడియం శ్రీహరి

  • స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో హరితహారం
  • విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన
  • పాఠశాలల్లో పండ్లు, పూల మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత
  • ప్రహరీగోడల చుట్టూ రెయిన్ బో కలర్స్ లో పూల మొక్కలు  

హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న నాలుగో విడత హరితహారం ఈసారి విద్యాసంస్థల్లో భారీ ఎత్తున చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న నిర్ణయించారు. స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల నినాదంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి యూనివర్సిటీ వరకు అన్ని విద్యా సంస్థల్లో హరితహారం నిర్వహించాలని, విద్యాశాఖ, అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో ఈ పనిచేయాలని సూచించారు. విద్యా సంస్థల్లో హరితహారం అమలుపై సదరు మంత్రులు ఈరోజు సంబంధిత అధికారులతో హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

విద్యా సంస్థల్లో నాలుగో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు విద్యాశాఖ పరంగా పూర్తి సహకారం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. స్వచ్ఛ పాఠశాల-హరిత పాఠశాల పేరుతో గత ఏడాది నుంచి హరితహారాన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అదే పేరుతో హరితహారం నిర్వహిద్దామని చెప్పారు.

పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు అన్ని విద్యాలయాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి బ్లాక్ ప్లాంటేషన్ చేయాలన్నారు. వచ్చేనెలలో జరిగే హరితహారం కార్యక్రమంలో ప్రతి విద్యార్థి, ప్రతి విద్యా సంస్థ పాల్గొనేలా ఆదేశాలు ఇస్తామన్నారు. పచ్చదనం ప్రాముఖ్యతపై కూడా విద్యార్థుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పర్యావరణంపై ఇప్పటికే పాఠశాలల్లో సబ్జెక్టు ఉందని, అవసరమైతే దీనిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య ఆధ్వర్యంలో వచ్చే పది రోజుల్లో అన్ని జిల్లాల డీఈఓలు, డీఎఫ్ఓలు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యాలయాల్లో ఖాళీస్థలాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి, ఆ మేరకు హరితహారం చేపట్టాలన్నారు. వీలైనంత వరకు పాఠశాలల్లో విద్యార్థులకు పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలను అటవీ శాఖ అధికారులు పంపిణీ చేయాలన్నారు.

పాఠశాలల్లోని ప్రహరీ గోడల చుట్టూ రెయిన్ బో కలర్స్ లో ఉండే పూల మొక్కలు నాటాలని సూచించారు. అదే విధంగా అల్లనేరేడు పండ్ల చెట్లు పాఠశాలల్లో నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో నెలకొకసారి స్వచ్ఛ పాఠశాల నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలల్లో మొక్కలు నాటడం వరకు విద్యాశాఖ శ్రద్ధ తీసుకుంటున్నా... వాటి పరిరక్షణలో అటవీశాఖ దృష్టి సారించాలన్నారు.

విద్యా సంస్థల్లోని ఖాళీ స్థలాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేసి ఉపాధి హామీ సిబ్బంది ద్వారా పరిరక్షిస్తే వందశాతం మొక్కలు బతికే అవకాశం ఉంటుందన్నారు. హరిత తెలంగాణ లక్ష్య సాధనలో విద్యా సంస్థలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడమే కాకుండా అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేతపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల విస్తరణలో కూడా చెట్లను నరకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించేలా అటవీ శాఖ అధికారులు చొరవ చూపాలన్నారు.

కాగా, గత మూడు హరితహారాల్లో కూడా ఎక్కువ శాతం విద్యా సంస్థల్లోనే విజయవంతం అయిందని, 80 శాతంపైగా మొక్కలు బతికాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మొక్కలు నాటడం, పరిరక్షించడంలో ఆసక్తి చూపిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇస్తున్నామని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చినా అది సరిగా ప్రచారం కావడం లేదన్నారు. విద్యార్థుల్లో పర్యావరణంపై, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే హానిపై అవగాహన పెంచాల్సి ఉందన్నారు. డిజిటల్ క్లాసుల్లో కూడా పర్యావరణం గురించి బోధించాలన్నారు.

  • Loading...

More Telugu News