pakistan: పాకిస్థాన్ ఇంజినీర్లకు మేనేజ్ మెంట్ ట్రైనింగ్ ఇస్తున్న టెర్రరిస్ట్ సంస్థ

  • చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ లో పని చేయనున్న ఇంజినీర్లు
  • జీతంలో కొంత భాగం లష్కరే తాయిబాకు చెల్లింపు
  • చైనా అధికారులకు కూడా ముప్పు ఉండే అవకాశం

భారత్ పై అనునిత్యం దాడులకు యత్నించే టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తాయిబా... పాకిస్థాన్ లోని ఇంజినీర్లకు మేనేజ్ మెంట్ ట్రైనింగ్ ఇస్తోంది. లాహోర్ లోని తన హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ లో వీరు ఉద్యోగం పొందడమే ట్రైనింగ్ ప్రధాన లక్ష్యం. ఈ విషయాన్ని భారత నిఘా విభాగం గుర్తించింది. ఈ ట్రైనింగ్ కు సంబంధించిన బాధ్యతలను ముంబై దాడులలో కీలక పాత్ర పోషించిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీకి ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
ట్రైనింగ్ లో భాగంగా ఏం నేర్పిస్తున్నారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అయితే, ఉద్యోగంలో చేరిన తర్వాత, ఇంజినీర్లు సంపాదించే జీతంలో ప్రతి నెలా కొంత డబ్బును లష్కరే తాయిబాకు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 300 మంది ఇంజినీర్లు చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ లో చేరబోతున్నట్టు సమాచారం. లాహోర్ లో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత... ఫిజికల్ ట్రైనింగ్ కోసం వీరిని అబోటాబాద్ కు పంపనున్నారు. అబోటాబాద్ ప్రాంతంలో టెర్రరిస్టు శిక్షణ శిబిరాలు ఉంటాయి.

మరోవైపు, ఈ అంశంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెర్రరిస్టుల వద్ద శిక్షణ పొందుతున్న ఇంజినీర్ల వల్ల ఎకనామిక్ కారిడార్ లో పని చేసే చైనా అధికారులకు కూడా ముప్పు ఉంటుందని అంటున్నారు. 

More Telugu News