pune: కోర్టులోనే భార్యపై పెట్రోలు పోసిన భర్త!

  • ట్రిపుల్ తలాక్ కేసు వెనక్కి తీసుకోమని ఒత్తిడి
  • అంగీకరించకపోవడంతో పెట్రోలు పోసిన భర్త
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

ట్రిపుల్ తలాక్ కేసులో తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిన భార్యను కోర్టు ఆవరణలోనే హత్య చేసేందుకు ప్రయత్నించాడో భర్త. ఆమెపై పెట్రోలు గుమ్మరించి అంటించబోయాడు. పూణేలోని శివాజీనగర్ కుటుంబ న్యాయస్థానంలో జరిగిందీ ఘటన. పారిపోయేందుకు ప్రయత్నించిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివాహమైనప్పటి నుంచి భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడని, అసహజ శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని బాధిత భార్య ఆరోపించింది. తాను ట్రిపుల్ తలాక్ చెప్పానని, విడాకులకు అంగీకరించాల్సిందిగా ఏడాదిన్నరగా భర్త సోహిల్ షేక్ ఒత్తిడి తెస్తున్నాడని భార్య (22) ఆరోపించింది. అంతేకాక, డబ్బు, బంగారం కోసం ఒత్తిడి తెస్తూ హింసిస్తున్నాడని పేర్కొంది. దీంతో తాను పుట్టింటికి వచ్చేసినట్టు చెప్పింది. తర్వాత విడాకుల నోటీసు పంపాడని, ట్రిపుల్ తలాక్ చెప్పాను కాబట్టి అంగీకరించాల్సిందేనంటూ బెదిరించడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపింది.

విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన సోహిల్, కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా మరోమారు కోరాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో ఒక్కసారిగా ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. తొలుత యాసిడ్ అనుకున్నానని, తర్వాత అది పెట్రోలు అని తెలిసిందని పేర్కొంది. కళ్లముందే జరిగిన ఘటనతో నివ్వెరపోయిన పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News