Narendra Modi: ఆనందీబెన్ వ్యాఖ్యలతో మోదీ సతీమణి షాక్.. మోదీ తనకు రాముడన్న జశోదాబెన్

  • మోదీకి పెళ్లి కాలేదన్న మధ్యప్రదేశ్ గవర్నర్
  •  వివరణ ఇచ్చిన మోదీ సతీమణి
  • ప్రధాని ప్రతిష్ఠను దిగజార్చవద్దని సూచన

మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు విని ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోదాబెన్ షాక్‌కు గురయ్యారు. ఓ గుజరాతీ దిన పత్రికతో గవర్నర్ మాట్లాడుతూ మోదీకి వివాహం కాలేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై జశోదాబెన్ స్పందించారు.

‘‘మోదీ వివాహం చేసుకోలేదన్న ఆమె మాటలతో ఆశ్చర్యపోయా. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమర్పించిన డిక్లరేషన్‌ పేపర్లలో తనకు పెళ్లి అయిందని మోదీ స్పష్టంగా తెలిపారు. ఆ పేపర్లపై నా పేరును కూడా చేర్చారు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆమె వ్యాఖ్యల వల్ల ప్రధాని ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉంది. మోదీ చాలా గౌరవనీయుడు. నా వరకు ఆయన రాముడు’’ అని జశోదాబెన్ స్పష్టం చేశారు. ఆమె ఈ విషయాలు మాట్లాడుతుండగా జశోదా సోదరుడు అశోక్ మోదీ మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశారు.

ఆనందీబెన్ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారో తమకు తెలియదని, కానీ ఈనెల 19న ప్రముఖ దినపత్రిక మొదటి పేజీలో వచ్చిందని అశోక్ మోదీ తెలిపారు. ఆనందీబెన్ వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చిత్రీకరించినట్టు ఆయన వివరించారు.

More Telugu News