చంద్రబాబులో అసహనం పెరిగిపోయింది.. ఎంత అహంకారం!: వైసీపీ ఎంపీ వరప్రసాద్‌

20-06-2018 Wed 13:27
  • గతంలో మత్స్యకారులతో మీ అంతు చూస్తానని అన్నారు
  • నాయీ బ్రాహ్మణుల పట్ల కూడా అదే రీతిలో ప్రవర్తించారు
  • ఢిల్లీకి వెళ్లి మోదీని నిలదీయలేకపోయారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు బాగోలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. గతంలో మత్స్యకారులతో మీ అంతు చూస్తానని అన్న చంద్రబాబు ఇటీవల నాయీ బ్రాహ్మణుల పట్ల కూడా అదే రీతిలో ప్రవర్తించారని ఆయన అన్నారు. వారు కనీస వేతనాలు ఇవ్వాలని అడిగినందుకు చంద్రబాబు అంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు కావాలి కానీ, వారి సంక్షేమాన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఆయనకు ఎంత అహంకారం? అని వరప్రసాద్‌ వ్యాఖ్యానించారు. బీజేపీపై యుద్ధం ప్రకటిస్తానని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి మాత్రం మోదీని నిలదీయలేకపోయారని అన్నారు. మోదీ అంటే ఆయనకు ఎంత భయం ఉందో దాన్ని బట్టే తెలుస్తోందని విమర్శించారు.