England: ప్రపంచ రికార్డు సృష్టించిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను ఊచకోత కోసిన ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్!

  • ఆస్ట్రేలియాపై రికార్డు విజయం
  • 481 పరుగులతో ప్రపంచ రికార్డు
  • 242 పరుగుల భారీ తేడాతో ఓడిన ఆసీస్
  • మరో రెండు వన్డేలు ఉండగానే సిరీస్ కైవసం
వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ జట్టు అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తూ కంగారూలకు చెమటలు పట్టిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలను గెలుచుకున్న ఇంగ్లండ్, మంగళవారం జరిగిన మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

నాటింగ్‌హామ్‌లో జరిగిన వన్డేలో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆసీస్ బౌలింగ్‌ను ఊచకోత కోసి గత రికార్డును బద్దలుగొట్టారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి 481 పరుగులు చేసి అత్యధిక వన్డే స్కోరు నమోదు చేశారు. 2016లో పాకిస్థాన్‌పై చేసిన 444 పరుగుల రికార్డును ఇంగ్లండ్ తానే బద్దలు కొట్టింది. ఒకానొక దశలో 500 పరుగుల మైలురాయిని చేరుకుంటుందని భావించినా చివర్లో త్వరత్వరగా వికెట్లు కోల్పోవడంతో 481 పరుగులతోనే సరిపెట్టుకుంది.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌లో అలెక్స్ హేల్స్ 92 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 147 పరుగులు చేయగా, ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 92 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జాసన్ రాయ్ 61 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82, ఇయాన్ మోర్గాన్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 67 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ స్కోరు పరుగులు పెట్టి 481 వద్ద ఆగింది.

482 పరుగుల భారీ లక్ష్యంతో ఆట ప్రారంభించిన ఆసీస్ 37 ఓవర్లలో 239 పరుగులకే పెవిలియన్ చేరింది. ఫలితంగా 242 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. మరో బౌలర్ ప్లంకెట్ మూడు, డేవిడ్ విల్లీ రెండు వికెట్లు తీశారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ 51, మార్కస్ స్టోయిన్స్ 44 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. అలెక్స్ హేల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
England
Australia
One-day
Record

More Telugu News