Jammu And Kashmir: గతంలో బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంది అధికారం కోసం కాదు!: మెహబూబా ముఫ్తీ

  • గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించాను
  • కశ్మీర్‌లో పరిస్థితులు చక్కదిద్దడానికే బీజేపీతో కలిశాం 
  • మేము 11,000 మంది యువతపై కేసులను ఉపసంహరించాం

పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. తమ రాష్ట్ర గవర్నర్ కు తన రాజీనామా లేఖ అందించానని, అలాగే తాము ఇక ఏ పార్టీతోనూ జత కట్టడం లేదని తెలిపారు. తాజా పరిణామాలతో తానేమీ షాక్ కి గురవ్వలేదని, తాము గతంలో బీజేపీతో కలిసింది అధికారం కోసం కాదని అన్నారు.

జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు చక్కదిద్ది, అభివృద్ధి పథంలో నడిపించడానికే ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. తమ పాలనలో 11,000 కశ్మీర్ యువతపై కేసులను ఉపసంహరించామని చెప్పారు. ఎన్నో గొప్ప ఆలోచనలు, ఆశయాలతో తాను పదవిని చేపట్టానని, శాంతి నెలకొల్పడానికి కృషి చేశానని అన్నారు. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం వల్ల కశ్మీర్‌లో అశాంతి నెలకొందని చెప్పారు.    

More Telugu News