nerella venu madhav: నేరెళ్ల వేణుమాధవ్ మృతిపై కేసీఆర్, జగన్, పవన్ సంతాపం

  • మిమిక్రీ కళకు ప్రపంచ గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తి
  • చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం ఆదేశాలు 

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మిమిక్రీ కళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కళకు పితామహుడిగా పేరొందారని ప్రశంసించారు. నేరెళ్ల మృతి కళారంగానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. వేణుమాధవ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎస్ ని కేసీఆర్ ఆదేశించారు.  

తెలుగువారి కీర్తిప్రతిష్టలను పెంచిన మిమిక్రీ కళాకారుడు

కాగా, వైసీపీ అధినేత జగన్ కూడా తన సంతాపం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ, జాతీయ వేదికలపై తెలుగువారి కీర్తిప్రతిష్టలను పెంచిన మిమిక్రీ కళాకారుడు, స్వరబ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్ అని, ఆయన మృతి తెలుగువారికి తీరనిలోటని అన్నారు. నేరెళ్ల వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నేరెళ్ల వేణుమాధవ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి

నేరెళ్ల మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందరో ప్రముఖల గాత్రాలను అనుకరించడమే కాకుండా పలు భాషల్లో ప్రదర్శనలు ఇచ్చి స్వర బ్రహ్మగా ఆయన చాటిన ప్రతిభ మరువలేనిదని కొనియాడారు. శాసనమండలి సభ్యులుగా, సంగీత నాటక అకాడమీ సభ్యులుగా చక్కటి సేవలందించారని, మిమిక్రీ కళకు ఉన్నత స్థానాన్ని కల్పించడంలోనూ, ఈ కళను ఓ ప్రొఫెషన్ గా స్వీకరించడంలోనూ ఆయన ఎందరికో స్ఫూర్తి నిచ్చారని ప్రశంసించారు. నేరెళ్ల వేణుమాధవ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ తన ట్వీట్ లో తెలిపారు.

More Telugu News