nani: 'జెర్సీ' కోసం క్రికెట్ లో శిక్షణ తీసుకుంటోన్న నాని

  • నాని హీరోగా రూపొందనున్న 'జెర్సీ'
  • క్రికెట్ నేపథ్యమే ప్రధాన కథాంశం 
  • సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

ఒక వైపున శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాని మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. మరో వైపున గౌతమ్ తిన్ననూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి 'జెర్సీ' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ, ఇటీవలే ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. 1986 .. 1996 మధ్య కాలంలో జరిగేదిగా ఈ కథ కనిపిస్తుందట.

క్రికెట్ ఆటలో తనకి గల టాలెంట్ ను ఆలస్యంగా గుర్తించిన ఒక యువకుడు, ఎలాగైనా భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవాలనుకుంటాడు. ఆ విషయంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళతాడు. చివరికి తాను అనుకున్నది సాధిస్తాడు. ఇలా ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందట. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది. అప్పటి వరకూ క్రికెట్ లో శిక్షణ తీసుకోవడం కోసం నాని రంగంలోకి దిగాడని అంటున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాను గురించిన ఇతర విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.    

More Telugu News